కొంతకాలంగా తెలంగాణకు కాబోయే అధ్యక్షుడు ఎవరనే ప్రశ్న వినిపిస్తున్నా..సమాధానం మాత్రం దొరకలేదు. అయితే ఈ ప్రశ్నకు త్వరలోనే అధిష్టానం సమాధానం ఇస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ కొత్త అధ్యక్షుడి గురించి అనేక లిస్టులు, సమీకరణాల పరిశీలించాక.. ఫైనల్ లిస్ట్ అధిష్టానం దగ్గరకు చేరింది. ఆ లిస్ట్‌లో ఉన్న ఒకరిని..ఈ నెలాఖరులోగా అంటే ఉగాదిలోగా అధ్యక్షుడిగా ప్రకటించబోతున్నారు.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం చేపట్టడమే లక్ష్యంగా బీజేపీ గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తుంది. దీనిలో భాగంగా సంస్థాగతంగా పార్టీ పదవులను భర్తీ చేస్తూ వస్తోంది. తెలంగాణలో 36 జిల్లాలకు కొత్త అధ్యక్షులను ఎన్నుకున్న బీజేపి ఇక రాష్ట్ర ప్రెసిడెంట్‌గా ఎవరిని నిలబెట్టాలి అనేదానిపై ఢిల్లీ పెద్దలు కసరత్తు చేస్తున్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఇప్పటికే ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు పేర్లు షార్ట్ లిస్ట్ అయినట్టు తెలుస్తోంది. గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన బండి సంజయ్ పేరే ప్రధానంగా వినిపిస్తోంది. అయితే తాను అధ్యక్ష రేసులో లేనని గతంలో బండి సంజయ్ స్వయంగా చెప్పినా కూడా అధిష్టానం పరిశీలనలో బండి పేరు కూడా ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ముగ్గురిలో ఎవరిని నియమిస్తే తెలంగాణలో కమల వికాసం సాధ్యమవుతుందనే దిశగా అధిష్టానం తర్జనభర్జనలు పడుతోన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు ఎంపిక కోసం ఇప్పటికే నేతలందరి అభిప్రాయాలను.. రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికల పరిశీలకురాలుగా ఉన్న శోభా కరంద్లాజే తీసుకున్నారు. దీంతో నేతల అభిప్రాయాలు, సమీకరణాలను బేరీజు వేసుకుని తెలంగాణకు కొత్త దళపతిని నియమించడానికి ఢిల్లీ పెద్దలు రెడీ అయ్యారు.
మరోవైపు మరికొంత మంది ఆశావహులు కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.తాజాగా అమిత్ షా, నడ్డాను కలిసిన వారిలో ఎంపీలతో పాటు పలువురు ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు.వీరిలో కొంతమంది తమ విన్నపాలను పార్టీ పెద్దల ముందు ఉంచినట్లు తెలుస్తోంది. అలాగే సంఘ్ పరివార్ మద్దతుతో తమ పేర్లను పరిశీలించాల్సిందిగా మరికొంతమంది విజ్ఞప్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఎవరిని కొత్త దళపతిగా ప్రకటించనున్నారో అన్న విషయం మరి కొద్ది రోజుల్లోనే తేలిపోనుంది.