శనివారం హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. విద్యాశాఖపై నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో ప్రధానంగా ‘మన ఊరు-మన బడి’ అమలుపై కీలక చర్చ జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ఈ ‘మన ఊరు-మన బడి’ పథకం. ఈ పథకం ద్వారా నగరాలు, పట్టణాల్లోనే కాకుండా మారుమూల పల్లెల్లోని పాఠశాలల్లో కూడా కార్పొరేట్ విద్యకు ధీటుగా అత్యుత్తమ విద్యాబోధనతో కూడిన సకల వసతులు విద్యార్థులకు కల్పించడం ప్రభుత్వ ముఖ్యోద్దేశం. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో నిర్వహించిన ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షత వహించారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి, తలసాని, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.
సమావేశం అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంపై వేసిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం అయిందని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుండి 8 వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో బోధన మొదలు పెడుతున్నామని పేర్కొన్నారు. ఈమేరకు టీచర్‌లకు కూడా శిక్షణ తరగతులు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా గల పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన గురించి, కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించామని వెల్లడించారు. ఇంగ్లిష్ మీడియం బోధనతో పాటు డిజిటల్ విద్యను కూడా విద్యార్థులకు అందించటానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని, అయితే ఒకేసారి కాకుండా దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపారు. దీనిలో భాగంగా, మొదటి విడతలో 3,000 స్కూళ్ళు అభివృద్ధి చేయనున్నామని అన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలుకోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోందని, 9 వేలకు పైగా స్కూళ్లలో మౌలిక సదుపాయలు కల్పించటం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.3,497 కోట్లను కేటాయించిందని చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ