తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నవంబర్ 21, గురువారం నాడు సాయంత్రం ఆర్టీసీపై కీలక సమీక్ష జరపనున్నారు. బుధవారం నాడు, ప్రభుత్వం ఎటువంటి ఆంక్షలు, షరతులు లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని, ఇందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే సమ్మె విరమించి మళ్లీ విధుల్లోకి చేరుతామని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. కార్మిక సంఘాల జేఏసీ ప్రకటన నేపథ్యంలో ఈ రోజు సీఎం కేసీఆర్ నిర్వహించే సమీక్ష ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశానికి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఇంఛార్జి ఎండీ సునీల్ శర్మ, ఇతర రవాణా శాఖ ఉన్నతాధికారులు, అడ్వొకేట్ జనరల్ తదితరులు హాజరుకాబోతున్నారు.
తెలంగాణలో అక్టోబర్ 5వ తేదీ నుంచి గత 47 రోజులుగా డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మెను కొనసాగించారు. ఈ మధ్యకాలంలో ప్రజల అవసరాల దృష్ట్యా సమ్మె విరమించి విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్ రెండుసార్లు విజ్ఞప్తి చేసిన, కార్మికులు సమ్మె విరమించలేదు. ఈ నేపథ్యంలో విలీన డిమాండ్ ను తాత్కాలికంగా పక్కనబెడతామని జేఏసీ ప్రకటించిన కూడ ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించలేదు. మరోవైపు సుదీర్ఘ విచారణ అనంతరం హైకోర్టు సైతం ఈ సమస్యను రెండు వారాలలోపు కార్మిక న్యాయస్థానంలో పరిష్కరించుకోవాలని సూచించింది. ఈ దశలో ఎటువంటి షరతులు లేకుండా, ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే సమ్మె విరమణకు సిద్ధమని ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. కార్మికుల విజ్ఞప్తిపై సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. సాయంత్రం జరిగే సమీక్షలో ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఇచ్చిన తీర్పు, జేఏసీ నాయకుల ప్రతిపాదనలుపై చర్చించి నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.
[subscribe]