తెలంగాణ కాంగ్రెస్ నేతలెవరూ బహిరంగంగా మాట్లాడొద్దని, విభేదాలుంటే అంతర్గతంగా చర్చించుకోవాలని సూచించారు దిగ్విజయ్ సింగ్. అధిష్టానం సూచన మేరకు ఆయన గురువారం, శుక్రవారం పార్టీలోని అంతర్గత విబేధాలపై పలువురు నేతలతో గాంధీభవన్ వేదికగా సమావేశం అయ్యారు. అనంతరం టీ-కాంగ్రెస్ సీనియర్ నేతలు.. భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు తదితరులతో కలిసి ఈరోజు మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.. పార్టీలో విభేదాలను పక్కన పెట్టి పనిచేయాలని, సమస్యలుంటే అంతర్గతంగా చర్చించుకోవాలి తప్ప బహిరంగంగా వ్యాఖ్యలు చేయొద్దని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నానని నేతలకు తెలిపారు. తెలంగాణలో ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, ఈ సమయంలో నాయకులంతా ఐక్యంగా ఉండి పోరాడితేనే ప్రత్యర్థుల్ని ఓడించగలమని సూచించారు.
బీజేపీకి మద్దతు పలికేందుకే సీఎం కేసీఆర్ బీఆర్‌ఎస్ పార్టీని ఏర్పాటు చేశారని, ఈ మేరకు ఆ రెండు పార్టీల మధ్య అవగాహన ఉందని ఆయన ఆరోపించారు. బీఆర్‌ఎస్ తెలంగాణ రాష్ట్రంలో ఒకలా, ఢిల్లీలో మరోలా ప్రవర్తిస్తోందని.. పార్లమెంటు ఉభయ సభల్లో బీజేపీతో బీఆర్‌ఎస్ దోస్తి చేస్తోందని, బయట మాత్రం కుస్తీ చేస్తున్నట్లు నటిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా? అని ప్రశ్నించిన ఆయన 2004లో ఇచ్చిన మాట ప్రకారం 2014లో ప్రత్యేక రాష్ట్రం ఇచ్చామని ఆయన గుర్తుచేశారు. అయితే తెలంగాణ ఏర్పడ్డాక కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ ప్రచారం చేశారని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను భయపెట్టి టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారని, దీనిని తిప్పి కొట్టడంలో రాష్ట్ర పార్టీ విఫలమైందని దిగ్విజయ్ సింగ్ తెలిపారు.
ఇక రాష్ట్రంలో జరిగే అన్యాయాలపై ఎంఐఎం స్పందించదని, కేసీఆర్ అమలు చేస్తామన్న 12 శాతం ముస్లీం రిజర్వేషన్లపై ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. బీజేపీని గెలిపించడానికే ఇతర రాష్ట్రాల్లో ఎంఐఎం పోటీ చేస్తోందని, ప్రత్యర్థి పరీల మధ్య ఓట్లు చీల్చడానికి బీజేపీ నేతృత్వంలో ఆ పార్టీ పని చేస్తోందని ఆరోపించారు. నరేంద్ర మోదీ పాలనలో దేశంలో పేదరికం పెరిగిపోతోందని, మధ్య, దిగువ తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. పలు రాష్ట్రాల్లో బీజేపీయేతర ప్రభుత్వాలను కూలుస్తున్నారని, ప్రత్యర్థులపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్నారని, చార్జ్‌షీట్ వేయకుండా, బెయిల్ రాకుండా కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు మంచి స్పందన వస్తోందని, దీనిని స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాలని తెలంగాణ నాయకులకు దిగ్విజయ్ సింగ్ పిలుపునిచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ