తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దళిత-గిరిజన ఆత్మగౌరవ దండోరా సభకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇంద్రవెల్లికి చేరుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ సభ జరగనుంది. ఇంద్రవెల్లిలో భారీ బహిరంగసభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. లక్షమందితో ఈ సభను నిర్వహిస్తామని, లక్షకు ఒక్కరు తక్కువైనా సీఎం కేసీఆర్ కు గులాంగిరీ చేస్తామని రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఆగస్టు 9న ఇంద్రవెల్లి గడ్డపై దండుకట్టి దండోరా మోగించబోతున్నామని, ఏడున్నరేళ్ల పాలనలో దళిత, గిరిజనులకు జరిగిన అన్యాయాన్ని మోసాన్ని ఎండగట్టేందుకే ఈ బహిరంగ సభను ఏర్పాటు చేసినట్లు రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ ఇంద్రవెల్లి సభకు ప్రజలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి యుద్ధభేరీ మోగించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఆదివారం నాడు రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, హుజూరాబాద్ ఉపఎన్నికలో లబ్ధి పొందేందుకే ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చిందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళితలు, గిరిజన, ఆదివాసీలందరికి రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఆగస్టు 9 నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు అన్నిజిల్లాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. సెప్టెంబర్ మొదటి వారంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని, ఇంద్రవెల్లి లాంటి సభలు రాష్ట్రంలో మరో నాలుగు నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ