గద్దర్‌ అవార్డ్స్‌ వేడుకకు ఘనంగా ఏర్పాట్లు

Telangana Gaddar Film Awards Ceremony to be Held Grandly on 14th June

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులను, సాంకేతిక నిపుణుల ప్రతిభను ప్రోత్సాహించే సంప్రదాయ కార్యక్రమానికి సీఎం రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా ఇటీవల ‘తెలంగాణ గద్ధర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌’ను ప్రకటించిన సంగతి తెలిసిందే. 2014 జూన్‌ నుండి 2024 డిసెంబర్‌ 31 వరకు సెన్సారు జరుపుకుని విడుదలైన ఉత్తమ చిత్రాలకు, వాటిలో నటించి ఉత్తమ ప్రతిభను చూపిన నటీనటులకు మరియు సాంకేతిక నిపుణులకు ఈ అవార్డ్స్ అందించనున్నారు.

రీసెంట్‌గా ఇందుకు సంబంధించిన విజేతల జాబితాను కూడా ప్రటించారు. జూన్‌ 14న ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. కాగా తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ అపూర్వ వేడుకకు హైదరాబాద్‌లోని హైటెక్స్‌ వేదిక కానుంది. ఈ శనివారం అంగరంగ వైభవంగా జరుగనున్న ఈ వేడుక కోసం హైటెక్స్‌ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. దాదాపు 6వేల మందికి పైగా ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు రానున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్‌ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు, సినిమాటోగ్రఫీ మినిస్టర్‌ కోమటి రెడ్డి వెంకటరె్డి గారు, టీఎఫ్‌డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు గారు ఇక ఈ వేడుకను అత్యంత ఘనంగా జరిపించడానికి తగు ఏర్పాటు చేయిస్తున్నారు. కాగా ఈ ప్రతిష్టాత్మక వేడుకకు తెలుగు తారాలోకమంతా తరలి రాబోతున్నారు. అలాగే పలువురు రాజకీయ ప్రముఖులు కూడా హాజరుకానున్నారు. దీంతో జూన్‌ 14న హైటెక్స్‌ వేడుక తారళ తళుకులతో ప్రకాశవంతం కాబోతుంది.

ఇదిలావుంటే, కొంత విరామం తరువాత తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న గద్దర్‌ అవార్డులు అందుకోవడం పట్ల అవార్డుల విజేతలు, తెలుగు సినిమా ప్రముఖులు, తెలుగు సినిమా ప్రేక్షకులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రతిభను గుర్తించడంతో పాటు ఒక పెద్ద వేదికపై తగు రీతిలో సత్కరించబోతున్న తెలంగాణ ప్రభుత్వంపై వారు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. తెలుగు సినిమాకి సంబంధించి ఇది ఖచ్చితంగా ఒక చారిత్రిక ఘట్టం కానుంది.