రంజుగా లోక‌ల్ రాజ‌కీయాలు.. అవిశ్వాస తీర్మానాల జోరు

Ranjuga Local Politics No Confidence Motions, Ranjuga Local Politics, No Confidence Motions, Local Politics, Local Politics No Confidence, Telangana Politics, BRS, Congress, Latest Local Politics News, Local Politics News Updates, KCR, Revanth Reddy, Telangana, Lok Sabha Elections, Mango News, Mango News Telugu
Telangana Politics, BRS, Congress

తెలంగాణ‌లో అధికారం మారిన త‌ర్వాత అసెంబ్లీ రాజ‌కీయాల సంగ‌తి ఏమో కానీ.. స్థానికంగా మాత్రం పొలిటిక‌ల్ హీట్ క‌నిపిస్తోంది. మునిసిపాల్టీ, కార్పొరేష‌న్ ల‌లో అవిశ్వాసాల తీర్మానాల జోరు పెరుగుతోంది. మ‌రో ఏడాదిలో స్థానిక  ఎన్నిక‌లు ఉండ‌గా, అంత‌కు ముందుగానే పిరాయింపుల ప‌ర్వం క‌నిపిస్తోంది. అధికారాలు చేతులు మారుతున్నాయి. దీంతో స్థానిక రాజ‌కీయాలు వాడివేడిగా  కొన‌సాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రాష్ట్రమంతా ఎలాగున్నా.. గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో బీఆర్ ఎస్ కు అనూహ్య ఫ‌లితాలు వ‌చ్చాయి. 24 నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ తిరుగులేని విధంగా జెండా ఎగుర‌వేసింది. ఆ ఫ‌లితాలు వెలువ‌డి రెండు నెల‌లు తిర‌గ‌క ముందే.. స్థానిక రాజ‌కీయాల్లో మార్పు క‌నిపిస్తోంది. శివారు మునిసిప‌ల్‌, కార్పొరేష‌న్ ల‌లో  పీఠాల కోసం పోరు జ‌రుగుతోంది. కొద్ది రోజుల క్రితం అబ్దుల్లాపూర్ మెట్.. తాజాగా మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి ఇలాకా అయిన జ‌వ‌హ‌ర్ న‌గ‌ర్ కార్పొరేష‌న్ లో క్యాంపు రాజ‌కీయాలు మొద‌ల‌య్యాయి. బ‌డంగ్ పేట్ కార్పొరేష‌న్ లోనూ అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు బీఆర్ ఎస్‌, బీజేపీ సిద్ధం అవుతున్నాయి.

జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఆర్ధరాత్రి కార్పొరేటర్లు క్యాంపు రాజకీయాలకు తెరలెపడంతో ఒక్కసారిగా రాజకీయం హీటెక్కింది. గ‌తేడాది 18వ డివిజన్‌ కార్పొరేటర్‌ శాంతి కోటేష్‌గౌడ్‌ మేయర్‌ పదవి కోసం ఆవిశ్వాస తిర్మానానికి తెరలేపారు. కానీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆవిశ్వాసాన్ని నాలుగేళ్లు పొడిగిస్తూ గవర్నర్‌ బిల్లు పంపినా అది ఆమోదం లభించక పలు కారణాలతో వాయిదా పడింది. జనవరి 27కి జ‌వ‌హ‌ర్ న‌గ‌ర్ పాలకవర్గానికి నాలుగేళ్లు  పూర్తి కావోస్తుంది. మరోసారి మేయర్‌ కావ్యపై అవిశ్వాసం పెట్టేందుకు కార్పొరేటర్లు సిద్ధ‌మ‌య్యారు. గతంలో కూడా 18 మంది కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానపత్రంపై సంతకాలు చేసి మేడ్చ‌ల్ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో అందజేశారు. మేయర్‌ పదవి బీసీ మహిళ రిజర్వేషన్‌ ఉన్నందున శాంతి కోటేష్‌గౌడ్‌ మేయర్‌ పదవి ఆశిస్తున్న వారిలో ముందంజలో ఉన్నారు. అయితే.. గ‌తేడాది క్యాంపు ల‌కు త‌ర‌లివెళ్ల‌ని  కార్పొరేట‌ర్లు ఈసారి ఏపీకి త‌ర‌లివెళ్ల‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

జ‌వ‌హ‌ర్ న‌గ‌ర్ కార్పొరేషన్‌ పరిధిలో మేయర్‌, డిప్యూటీ మేయర్‌ కాకుండా 26 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అందులో 16 డివిజన్‌ కార్పొరేటర్‌ గత ఏడాది మృతి చెందారు. అవిశ్వాస కోసం 18 మంది కార్పొరేటర్ల‌ మద్దతు కావాల్సి ఉంది. అందుకు తగ్గట్టుగా నిన్న 18 కార్పొరేటర్లు క్యాంపు న‌కు త‌ర‌లి వెళ్లారు. దీంతో మేయర్‌ కావ్య శిబిరంలో ఒక్కసారిగా అలజడి నెలకొంది. తనకు మద్దతుగా 10 మంది కార్పొరేటర్లు ఉన్నప్పట్టికీ మరో ముగ్గురు, నలుగురు టచ్‌లో ఉన్నారు. వారు సైతం క్యాంపున‌కు వెళ్లడంతో మేయర్‌ వర్గం మరి కొందరు కార్పొరేటర్లను తమ వైపు తిప్పేందుకు తమ వంతు ప్రయత్నాలను ప్రారంభించింది.

మ‌రో మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌లో నూ అవిశ్వాస తీర్మానానికి కార్పొరేట‌ర్లు సిద్దం అయ్యారు. ఇక్క‌డ కాంగ్రెస్ మేయ‌ర్ ను దించేందుకు బీజేపీ – బీఆర్‌ఎస్ లు ఒక్క‌ట‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇక్కడి కాంగ్రెస్ మేయర్‌ చిగిరింత పారిజాతానర్సింహారెడ్డి,  డిప్యూటీ మేయర్‌ ఇబ్రాం శేఖర్‌(ఇండిపెండెంట్‌)పై అవిశ్వాసం పెట్టడానికి రంగం సిద్ధమవుతోంది. అయితే బీజేపీ, బీఆర్ ఎస్ మ‌ధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ప్ర‌స్తుతం అవిశ్వాసం అంశం డైలమాలో పడింది. బీఆర్‌ఎస్‌లోని మెజారిటీ కార్పొరేటర్లు మేయర్‌ ఒక్కరిపైనే అవిశ్వాసం పెట్టాలని స్పష్టం చేస్తుండగా.. ఇంకొందరు మాత్రం డిప్యూటీ మేయర్‌పైనా అవిశ్వాసం పెట్టాలని పట్టుబడుతున్నారు. ఇక బీజేపీ కార్పొరేటర్లు సైతం మేయర్‌, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాసం పెట్టి  ఇద్దరినీ దించేస్తే.. ఆ తర్వాత చెరో పదవి పంచుకోవచ్చునని, ఒకరినే దించేస్తే ఎలా అనే చ‌ర్చ జ‌రుగుతోంది.

బడంగ్‌పేట్‌లో బీఆర్‌ఎస్‌, బీజేపీలకు మెజారిటీ స్థానాలు ఉన్నప్పటికీ ఆ రెండు పార్టీలకు అటు మేయర్‌ పదవిగానీ, ఇటు డిప్యూటీ మేయర్‌ పదవిగానీ లేదు. 2020 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు మేయర్‌ పీఠం దక్కించుకోవడానికి అవసరమైనన్ని స్థానాలు లేకపోవడంతో అప్పట్లో మంత్రిగా ఉన్న సబితారెడ్డి.. కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ పారిజాతారెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేర్చుకుని మేయర్‌ పదవి కట్టబెట్టారు. ఇక ఒకే స్థానంలో గెలిచిన బీఎస్పీ కార్పొరేటర్‌ ఇబ్రాం శేఖర్‌ను డిప్యూటీ మేయర్‌ చేశారు. దాంతో మెజారిటీ స్థానాలున్న బీఆర్‌ఎస్‌, బీజేపీ కార్పొరేటర్లకు  నిరాశే మిగిలింది. ఇప్పుడు కాంగ్రెస్ మేయ‌ర్ దించేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.  రాష్ట్రంలోని ప‌లు మునిసిపాలిటీల్లో నూ అసమ్మతి రగడ రాజుకుంటోంది. మెజారిటీ మునిసిపాలిటీల్లో బీఆర్‌ఎస్‌ చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు ఉండగా.. చాలా చోట్ల కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెడుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − eight =