తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్-2 పరీక్షల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన బీర్‌దార్ మనోహర్‌రావు తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో 439.344 మార్కులతో రాష్ట్రవ్యాప్తంగా మూడో ర్యాంకు సాధించారు. మనోహర్‌రావుకు ఇది కొత్త కాదు – 2020లో నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలో కూడా ఆయన మూడో ర్యాంకు సాధించి తన స్థాయిని నిలబెట్టుకున్నారు.
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం ఉజ్జంపాడ్ గ్రామానికి చెందిన మనోహర్‌రావు పూర్వ విద్యంతా ప్రభుత్వ బడుల్లోనే పూర్తి చేశారు. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన, చిన్నప్పటి నుంచే కష్టపడి చదవాలన్న పట్టుదలతో ఉన్నారు. తెలంగాణ ఉద్యమం ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలపై అవగాహన పెంచుకుని, సివిల్ సర్వీసెస్‌కు ప్రిపరేషన్ మొదలుపెట్టారు. తన కృషితో ఇప్పటి వరకు 6 ప్రభుత్వ ఉద్యోగాలను సాధించడం గమనార్హం.
విద్యా ప్రస్థానం & ఉద్యోగాలు
మనోహర్‌రావు తండ్రి పండరినాథ్ కీర్తనకారుడు కాగా, తల్లి కమలమ్మ గృహిణి. ఆయన పీజీ ఎకనామిక్స్, బీఈడీ పూర్తి చేశారు. ఆయనకు భార్య మనీష, ఇద్దరు పిల్లలు మనస్విని (3వ తరగతి) మరియు మహేశ్వర్ (1వ తరగతి) ఉన్నారు. 2017లో టీజీటీ పరీక్షలో రాష్ట్రస్థాయిలో మొదటి స్థానం, అలాగే పీజీటీలో మూడో ర్యాంకు సాధించారు. ప్రస్తుతం మెదక్ జిల్లా కొల్చారం మండలం అంసాన్‌పల్లి ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు.
గ్రూప్-2 & జూనియర్ లెక్చరర్ సాధన
2020లో గ్రూప్-2 పరీక్ష రాసిన మనోహర్‌రావు, మూడో ర్యాంకు సాధించి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో డిప్యుటీ తహసీల్దార్‌గా పని చేశారు. అనారోగ్యం కారణంగా ఆ పదవికి రాజీనామా చేసి తిరిగి ఉపాధ్యాయ వృత్తిలో చేరారు.
తాజాగా, 2024 గ్రూప్-2 ఫలితాల్లో మళ్లీ మూడో ర్యాంకు సాధించారు. అంతేకాదు, జూనియర్ లెక్చరర్ పరీక్షలో 4వ ర్యాంకు సాధించి అర్హత పొందారు. మార్చి 12న హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. త్వరలోనే మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో లెక్చరర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
లక్ష్యం – డిప్యుటీ కలెక్టర్
గ్రూప్-2 పరీక్షకు సిద్ధమవుతూ, టీచర్ ఉద్యోగానికి 6 నెలల సెలవు తీసుకుని అశోక్‌నగర్‌లో కోచింగ్ తీసుకున్నానని మనోహర్‌రావు తెలిపారు. రోజుకు 4 గంటలే నిద్రపోయి, మిగతా సమయం మొత్తం చదువుకే కేటాయించారని చెప్పారు. తన తుది లక్ష్యం డిప్యుటీ కలెక్టర్ కావడం అని, దానికోసం మరోసారి ప్రయత్నించనున్నట్టు వెల్లడించారు.