తెలంగాణ రాష్ట్రం చేనేత ఉత్పత్తులకుగాను దేశంలో గుర్తింపు పొందిన ప్రాంతం. ఇప్పుడు ఆ గుర్తింపును మరింత పెంచడానికి కాంగ్రెస్ సర్కారు కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో తయారయ్యే అన్ని చేనేత ఉత్పత్తులపై ప్రత్యేకమైన హ్యాండ్లూమ్ మార్క్ (లోగో)ను అమలు చేయాలని రాష్ట్ర చేనేత, జౌళిశాఖ నిర్ణయించింది.
ఈ మార్క్ ద్వారా చేనేత ఉత్పత్తులకు ప్రత్యేక బ్రాండ్ గుర్తింపు లభిస్తుందని, తెలంగాణ చేనేతకార్మికుల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని రాష్ట్ర చేనేత, జౌళిశాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ తెలిపారు.
ప్రత్యేక హ్యాండ్లూమ్ మార్క్‌లో విశేషాలు
ప్రస్తుతం దేశవ్యాప్తంగా సిల్క్ చీరలకు సిల్క్‌మార్క్ అందుబాటులో ఉంది. అదే విధంగా చేనేత ఉత్పత్తులకు హ్యాండ్లూమ్ మార్క్‌ను తెచ్చేందుకు తెలంగాణ చర్యలు చేపట్టింది. కొత్తగా రూపొందించిన ఈ హ్యాండ్లూమ్ మార్క్‌లో చేనేత వస్త్రాన్ని నేస్తున్న కార్మికుడి బొమ్మ ఉంటుంది.
ఈ లోగోను తెలంగాణలోని అన్ని చేనేత సంఘాల పరిధిలోని మగ్గాలకు జియోట్యాగ్‌తో లింక్ చేయనున్నారు. ప్రతీ మగ్గానికి ప్రత్యేక లేబుల్‌ను అందించనున్నారు. ఈ లేబుల్‌లో 9 అంకెల సంఖ్య ఉంటుంది:
మొదటి రెండు అంకెలు జిల్లా/ఏడీ కోడ్. తరువాత రెండంకెలు సంవత్సరాన్ని సూచిస్తాయి. చివరి ఐదు అంకెలు రన్నింగ్ సీరియల్ నంబరుగా ఉంటాయి. లేబుల్‌లో కార్మికుడి వివరాలు, ఉత్పత్తి ప్రత్యేకతలు కూడా ఉంటాయి.
ఆర్థిక సాయం, ప్రోత్సాహం
ఈ లోగో ఉపయోగించే చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తుంది. ప్రతినెలా 42 మీటర్ల పొడవు కలిగిన వస్త్రాలను నేసే కార్మికులకు, వార్ప్ల సంఖ్య ఆధారంగా వార్షికంగా రూ.18,000 వరకు ఆర్థిక సాయం అందించనున్నారు.
ప్రముఖ చేనేత ఉత్పత్తులకు బ్రాండ్ గుర్తింపు
తెలంగాణలో పోచంపల్లి, గద్వాల, నారాయణపేట పట్టుచీరలు, సిద్దిపేట గొల్లభామ చీరలు, నల్గొండ ఇక్కత్ చీరలు, వరంగల్ కార్పెట్లు, కరీంనగర్ దుప్పట్లు విస్తృతంగా ప్రసిద్ధి చెందాయి. ఇప్పుడు ఈ ఉత్పత్తులన్నింటికీ హ్యాండ్లూమ్ మార్క్ ద్వారా ప్రత్యేక బ్రాండ్ గుర్తింపు రానుంది.
ఫిబ్రవరి నుంచి అమలు
ప్రత్యేక హ్యాండ్లూమ్ మార్క్ లేబుల్ ముద్రణను ఫిబ్రవరి నుంచి అమలు చేస్తామని ప్రకటించారు. ఈ దిశగా చర్యలు వేగంగా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. తెలంగాణ చేనేత ఉత్పత్తులకోసం ఈ కొత్త హ్యాండ్లూమ్ మార్క్ చేనేత రంగానికి కొత్త శక్తిని అందించనుంది. బ్రాండ్ గుర్తింపు పెరగడంతో తెలంగాణ చేనేత ఉత్పత్తులు దేశవ్యాప్తంగా ఆర్థిక మరియు సాంస్కృతిక స్థాయిలో మరింత ముందుకు వెళ్లే అవకాశాలున్నాయి.