పెద్దగట్టు జాతరను సందర్శించిన మంత్రులు జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్

Telangana Ministers Jagadish Reddy and Talasani Srinivas Yadav Visited Peddagattu Jatara

సూర్యాపేట జిల్లాలోని పెద్దగట్టులో జరుగుతున్న లింగమంతుల స్వామి జాతరను సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర మంత్రులు జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు సందర్శించారు. ఈ సందర్భంగా వారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ పెద్దగట్టు జాతర సకల సదుపాయాల కల్పనపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టిని సారించారని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నా, ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. పెద్దగట్టు చుట్టూ 50 ఎకరాల విస్తీర్ణంలో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారని చెప్పారు. అంతే కాకుండా సీసీ కెమెరాలతో అత్యంత పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారని ఆయన వెల్లడించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో శానిటేషన్ పై అధికారులు ప్రత్యేక దృష్టిని పెట్టడం జరుగుతుందని తెలిపారు. కాళేశ్వరం నదీ జలాల ప్రభావం పెద్దగట్టు జాతరపై స్పష్టంగా కనిపిస్తోందన్నారు.

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ జాతరలో కాళేశ్వరం జలాలతో త్రాగునీరు అందించిన ఘనత మంత్రి జగదీష్ రెడ్డిదని చెబుతూ, జగదీష్ రెడ్డి అభినందనీయుడనని అన్నారు. లింగమంతుల స్వామి యాదవుల ఇలవేల్పు అని, అటువంటి స్వామి కరుణ కటాక్షాలతో రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో దేవాలయాలకు పూర్వ వైభవం తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని ఆన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ గుజ్జ దీపికా యుగంధర్ రావు, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ లతో పాటు శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్, చిరుమర్తి లింగయ్య, యన్.భాస్కర్ రావు, బొల్లం మల్లయ్య యాదవ్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పల లలితా ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ