హైదరాబాద్ కోఠిలోని తెలంగాణ మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చాకలి ఐలమ్మ 39 వ వర్థంతిని పురస్కరించుకుని ప్రభుత్వం రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. తెలంగాణలో ధీర వనిత ఐలమ్మ స్పూర్తిని కొనసాగిస్తామన్నారు. పోరాటయోధురాలిని స్మరిస్తూ ఐలమ్మ మనుమరాలు శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ప్రశ్నించే గొంతులు, ప్రజా సమస్యలను పరిష్కరించే వారూ తమకు కావాలని వ్యాఖ్యానించారు. ఐలమ్మ కుటుంబ సభ్యులు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండాలని భావిస్తున్నట్టు తెలిపారు.
గడీలలో గడ్డి మొలవాలి అనే నినాదం ఇచ్చిన ఐలమ్మ దొరల చేతుల్లో ఉన్న వేలాది ఎకరాలను పేదలకు చేరాలని పోరాటం చేశారంటూ వారిని స్మరించుకున్నారు. ఐలమ్మ స్పూర్తితో ఇందిరా గాంధీ దేశంలో భూ సంస్కరణలు తెచ్చారని, భూమి పేదవాడి ఆత్మగౌరవం, అందుకే ఇందిరమ్మ పేదలకు లక్షల ఎకరాలను పంచిపెట్టారని అన్నారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ భూ హక్కులను ఇస్తే.. ధరణి పేరిట వాటిని లాక్కోవాలని గత ప్రభుత్వం ఆలోచన చేసింది. ధరణి ముసుగులో వాటిని లాక్కోవాలని కుట్ర జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
చరిత్రలో గొప్ప వ్యక్తుల పేరు కలకాలం నిలిచిపోవాలని, వారి స్ఫూర్తి మరింత ముందుకు సాగిపోవాలనే ఆలోచనతో గడీ కంచెలు బద్దలు కొట్టి ప్రజా భవన్‌కు జ్యోతిరావు పూలే పేరు పెట్టుకున్నామని, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్‌టైల్‌కి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టామని, కోఠి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టబోతున్నామని తెలిపారు. సామాజిక చైతన్యం తీసుకొచ్చి, పేదలకు హక్కులు కల్పించిన వ్యక్తుల పేర్లు మనకెప్పుడూ స్ఫూర్తిగా ఉండాలనే ఈ నిర్ణయమన్నారు. రాష్ట్రంలో ఐలమ్మ స్పూర్తిని కొనసాగిస్తామన్నారు. అనంతరం ఐలమ్మ కుటుంబసభ్యులను సీఎం రేవంత్‌రెడ్డి సన్మానించారు. బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ 2022-23లో కోఠి మహి ళా కాలేజీని వర్సిటీగా అప్‌గ్రేడ్ చేసి ‘తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం’ పేరును ఖరారు చేసి, 100 కోట్ల నిధులను ప్రకటించింది. రెం డేండ్లుగా వర్సిటీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఐల మ్మ పేరును పెడతామని సీఎం ప్రకటించారు. తెలుగు వర్సిటీ పేరు మార్పుపైనా ఊహాగానాలు వెలువడుతున్నాయి.