ఏఐ పెట్టుబడులపైనే తెలుగు రాష్ట్రాల స్పెషల్‌ ఫోకస్‌

Telugu States Special Focus On Ai Investments

కృత్రిమ మేధకు పెద్దపీట వేసే దిశగా రెండు తెలుగు రాష్ట్రాలు వేగంగా అడుగులు వేస్తున్నాయి. దానికి అనుగుణంగానే దావోస్‌ టూర్‌లో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఏఐ పెట్టుబడులపైన ప్రత్యేక ద‌ృష్టి సారించాయి. ఫ్యూచర్ జెనరేషన్‌ను దృష్టిలో ఉంచుకుని.. దావోస్‌ టూర్‌లో ప్రముఖ సంస్థలతో చర్చలు చేస్తూ.. కీలక నిర్ణయాలను తీసుకుంటున్నాయి.

దావోస్‌ పర్యటనలో రెండు తెలుగు రాష్ట్రాలకు పెట్టుబడుల వెల్లువ కొనసాగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు, అధికారుల బృందాలు వివిధ కంపెనీలతో కీలక ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పోటీ పడుతూ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. మోడ్రన్‌ టెక్నాలజీ యుగం అభివృద్ధి చెందుతుండటంతో..ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌పై రెండు ప్రభుత్వాలు స్పెషల్ గా ఫోకస్ పెంచాయి.

దానిలో భాగంగా.. దావోస్ టూర్‌లో ఏఐ ఇన్వెస్టిమెంట్స్‌కు సంబంధించి తాజాగా రేవంత్ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టడానికి కంట్రోల్ ఎస్ సంస్థ ముందుకొచ్చింది. 10 వేల కోట్ల పెట్టుబడితో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు, కంట్రోల్ ఎస్ సీఈవో శ్రీధర్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. 400 మెగావాట్ల సామర్థ్యంతో AI డేటా సెంటర్ ఏర్పాటు కాబోతుండగా, దీనివల్ల 3,600 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నట్లు శ్రీధర్‌బాబు ప్రకటించారు.

మరోవైపు టెక్నాలజీ విషయంలో ఎప్పుడు కూడా దూకుడు ప్రదర్శించే సీఎం చంద్రబాబు నాయుడు.. ఇప్పటికే ఏపీలో ఏఐ సేవల వినియోగంపైన స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. పెట్టుబడులే లక్ష్యంగా దావోస్‌లో మంత్రి నారా లోకేశ్ సారథ్యంలో పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఏఐ పెట్టుబడులు ఆకర్షించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మంగళవారం దావోస్‌లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సద్వినియోగంతో తెలివైన, స్థిరమైన భవిష్యత్ నిర్మాణం అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ భేటీలో పాల్గొన్నారు నారా లోకేష్‌.

ఏపీ రాజధాని అయిన అమరావతిలో ఏఐ సిటీని ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోందని మంత్రి లోకేష్ చెప్పారు. రిమోట్ సెన్సింగ్, ఏఐ సాంకేతికలను ఏకీకృతం చేయడం ద్వారా వ్యవసాయ రంగంలో తాము మెరుగైన ఉత్పాదకత కోసం కృషి చేస్తున్నామని వివరించారు. పబ్లిక్ హెల్త్ విభాగంలోనూ ఏఐ వినియోగంతో.. తక్కువ ఖర్చుతో హెల్త్ ప్రొటెక్షన్, సర్వీస్ డెలివరీ మెరుగుదల వంటి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వివిధ రకాల ఛాలెంజెస్‌ను పరిష్కరించడంలో ఏఐ వినియోగం తీవ్ర ప్రభావం చూపుతుందని లోకేష్ చెప్పారు.