హైడ్రా టార్గెట్ ఎవరు…?

The Hyderabad Disaster Response Assets Protection Agency Was Responsible For The Demolitions

గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో హైడ్రా (హైదరాబాద్‌ డిజాస్టర్ రెస్పాన్స్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ)  సంచలనంగా మారింది. హైడ్రా అధికారులు ప్రస్తుతం అక్రమార్కులు, కబ్జా కోరుల పాలిట సింహ స్వప్నంలా మారారు.  నగరంలోని చెరువులు, కుంటలున్న పరిధిలో అక్రమంగా కట్టిన కట్టడాలను కూల్చి వేసే పనిలో పడింది. హీరో నాగార్జున కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతతో ఒక్క సారిగా హైడ్రా తీసుకుంటున్న నిర్ణయాలతో అంతటా ఉత్కంఠ నెలకొంది. కాగా హైడ్రాను పూర్తిస్థాయిలో బలోపేతం చేస్తే అక్రమ కట్టడాలకు చెక్‌ పెట్టొచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

అందుకోసమే రాష్ట్రంలో ఎన్నో సంచలనమైన కేసులను టేకప్ చేసి.. పేరు తెచ్చుకున్న ఏవీ రంగనాథ్‌ను కాంగ్రెస్ సర్కార్ ఏరికోరి తీసుకువచ్చి.. హైడ్రా కమిషనర్‌గా నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయేషా మీరా హత్య కేసు, నల్గొండ జిల్లాలో అమృత-ప్రణయ్‌ కేసుల్లో ఏవీ రంగనాథ్ చాకచక్యంగా వ్యవహరించారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి కి దమ్ము ఉంటే.. తమ పార్టీకి చెందిన నేతల అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష పార్టీలు సవాల్ విసురుతున్నారు. దీంతో హైదరాబాద్ సహా తెలంగాణలో అక్రమ కట్టడాలపై తుది వరకు రేవంత్ రెడ్డి ఇదే దూకుడును కంటిన్యూ చేస్తారా ? లేకపోతే.. మధ్యలో మిడిల్ డ్రాప్ అవుతారా అనేది సష్పెన్స్ గా మారింది.

ఇప్పటి వరకు 18 ప్రాంతాల్లో 43 ఎకరాల స్థలం స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వానికి హైడ్రా నివేదిక ఇచ్చింది. జాబితాలో పలు రంగాలకు చెందిన ప్రముఖలు ఉన్నారు. చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకర్రాజు, కావేరీ సీడ్స్ భాస్కర్రావు, ప్రొ కబడ్డీ యజమాని అనుపమ కట్టడాలు కూల్చివేసినట్లు రిపోర్ట్ లో వెల్లడించింది. లోటస్పాండ్, మన్సూరాబాద్, బంజారాహిల్స్, బీజేఆర్ నగర్, గాజుల రామారం, అమీర్ పేట్ లో అక్రమ కట్టడాలు కూల్చేసినట్లు హైడ్రా రిపోర్ట్ లో పేర్కొంది. ప్రస్తుతం చెరువుల్లో కట్టిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా చూపిస్తున్న దూకుడు.. చివరకు వరకు కంటిన్యూ చేస్తుందా.. లేదా అనేది చూడాలి. మరోవైపు ప్రభుత్వం ప్రకటించిన ఋణ మాఫీ పూర్తి స్థాయిలో కాకుండా పరిమితంగా చేయడంపై విమర్శలు వస్తున్నాయి. వాటి నుంచి దృష్టి మరలించడానికే రేవంత్ రెడ్డి హైడ్రాను రంగంలోకి దింపినట్లు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమకు అనుకూలంగా లేని రాజకీయ ప్రత్యర్థులు, రియల్టర్లను భయపెట్టేందుకే హైడ్రాతో కలిసి ఈ హై డ్రామాకు తెరలేపిందనే మరో వాదన కూడా ప్రతిపక్షాల నుంచి వినిపిస్తోంది.