తెలంగాణలో రోడ్డు విస్తరణ, కొత్త రోడ్లు నిర్మాణంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ఫోకస్ పెడుతున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కొత్త రోడ్లు మంజూరు చేయగా మరి కొన్ని ప్రాంతాల్లో రోడ్ల విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
తెలంగాణలో మరో కొత్త జాతయ రహదారి అందుబాటులోకి రానుంది. మెదక్, కామారెడ్డి జిల్లా మీదుగా నేషనల్ హైవేపై నిర్మాణానికి కేంద్రం నిధులు గ్రాంట్ చేయగా.. ప్రస్తుతం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 526 కోట్ల రూపాయలతో 95 కిలో మీటర్ మేర మెదక్- ఎల్లారెడ్డి- బాన్సువాడ- రుద్రూర్ వరకు ఈ రోడ్డును నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ రోడ్డు పనులు ప్రారంభం కాగా.. యుద్ధప్రతిపాదికన పూర్తి చేస్తుండటంతో.. త్వరలోనే వాహనదారులకు ఈ రోడ్డు అందుబాటులోకి రాబోతోంది.
మొదటి విడతలో మెదక్ నుంచి ఎల్లారెడ్డి వరకు 43.91 కి.మీటర్ల మేర పనులకు కేంద్రం 213 కోట్ల రూపాయలను కేటాయించింది. రెండో విడతగా ఎల్లారెడ్డి నుంచి బాన్సువాడ మీదుగా రుద్రూర్ వరకు కొత్త రోడ్డు నిర్మించున్నారు. మెుత్తం 51. 66 కి.మీటర్ల మేర పనులకు 313 కోట్లు రూపాయలు మంజూరు చేశారు. మొదటి, రెండు ప్యాకేజీ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రోడ్డు నిర్మాణంలో భాగంగా.. ఇప్పటికే డబుల్ రోడ్డుకు రోడ్డుకు రెండువైపులా ఉన్న చెట్లను తొలగించి.. రోడ్డు వెడల్పు పనులను కూడా పూర్తిచేశారు. వాటిని కంకరతో నింపి.. గ్రామాలకు వెళ్లే సర్వీస్ రోడ్లను, డ్రైనేజీలను కూడా నిర్మిస్తున్నారు. రెండో ప్యాకేజీలో ఎల్లారెడ్డి -రుద్రూర్ వరకు చేపట్టిన పనుల్లో ఇప్పటికే 50 శాతం వరకూ పూర్తి చేశారు.
మెుత్తం రోడ్డు పొడవులో 18 కి.మీటర్ల వరకూ అటవీ మార్గం గుండా వెళుతుండటంతో…ఈ రోడ్డు నిర్మాణానికి అటవీశాఖ నుంచి అనుమతి రావాల్సి ఉంది. ఆ అనుమతులు కూడా వస్తే మరింత వేగంగా పనులు జరిగే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇక ఈ నేషనల్ హైవే రాకతో లోకల్ భూములకు విపరీతంగా డిమాండ్ పెరిగిపోయింది. రోడ్డుకు రెండువైపులా ఉన్న భూములు లక్షల్లో పలుకుతుండటంతో అక్కడ భూములన్న వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు నిర్మాణం వల్ల తమ భూములకు అమాంతం విలువ పెరిగిందని.. గ్రామాల నుంచి వెళ్లే రోడ్డుకి సర్వీస్ రోడ్డు నిర్మించడం సంతోషంగా ఉందని అంటున్నారు.