
మొత్తం మూడు విడతల్లో రుణమాఫీ చేస్తామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈ రోజు సాయంత్రం 4 గంటలకు లక్ష రూపాయల వరకు ఉన్న రైతు రుణాలకు నిధులు విడుదల చేస్తామని… 7వేల కోట్లు రైతుల ఖాతాల్లోకి వెళ్తాయని చెప్పారు. జులై నెలాఖరులోగా లక్షన్నర రూపాయల వరకు, ఆగస్టులో 2లక్షల రూపాయల వరకు ఉన్న రుణాలను కూడా మాఫీ చేస్తామని అన్నారు. టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో రైతు రుణమాఫీపై ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి .. ఆగస్టు పూర్తయ్యేలోగా 3 విడతల్లో రైతుల రుణమాఫీ పూర్తవుతుందని స్పష్టం చేశారు.
ప్రజాభవన్‌లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కాంగ్రెస్ నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సమావేశమయ్యారు. రైతు రుణమాఫీతో పాటు పలు అంశాలపైన కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా 2022 మే 6న వరంగల్ డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ రైతులకు రూ.2లక్షలు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చినట్లు సీఎం గుర్తు చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్నా సరే కేసీఆర్ రూ.28వేల కోట్లు కూడా రైతు రుణమాఫీ చేయలేకపోయారన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తామని చెప్పామని ..చెప్పినట్లుగానే అమలు చేస్తున్నామని అన్నారు.
ఆర్ధిక నిపుణులు కూడా రుణమాఫీ కష్టమని చెప్పారని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి..ప్రభుత్వానికి ఆర్ధిక ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారని గుర్తు చేశారు. రైతు రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారు కాబట్టి..ఆయన మాట ఇచ్చారంటే అది చేసి తీరతారన్న నమ్మకం కలిగించడం తమ బాధ్యత అని చెప్పుకొచ్చారు. తెలంగాణలో ప్రతీ రైతును కూడా రుణ విముక్తుడిని చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రుణమాఫీ పేరుతో కేసీఆర్‌లా మాటలు చెప్పి తాము రైతులను మభ్య పెట్టడం లేదని అన్నారు రేవంత్. రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఏక మొత్తంలో రూ.2లక్షల రుణమాఫీని పూర్తి చేసి రైతుల ఆత్మగౌరవాన్ని నిలబెడుతున్నామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడు నెలల్లో సంక్షేమానికి రూ.30వేల కోట్లు ఖర్చు చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE