ఆయన మూడోసారి.. ఈయన ఎనిమిదో సారి.. గెలుపెవరిదో ఈసారి..!

teangana assembly elections, telangana politics, talasani srinivas yadav, marri shashidhar reddy
teangana assembly elections, telangana politics, talasani srinivas yadav, marri shashidhar reddy

ఆ నియోజకవర్గంలో ఇద్దరూ ప్రముఖ నేతలే. రాజకీయంగా ఉద్దండులే. ఒకరు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి అధికార పార్టీలో కీలక మంత్రి. మరొకరు మాజీ ముఖ్యమంత్రి కొడుకు.. ఏడుసార్లు అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఏకంగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి. ఒకరు మూడోసారి.. ఇంకొకరు ఎనిమిదో సారి ఈ ఎన్నికల్లో తలపడుతున్నారు. దీంతో గెలుపెవరిది అనేది ఉత్కంఠగా మారింది.

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని కీలక నియోజకవర్గం సనత్‌నగర్‌. ఇక్కడి నుంచి పోటీ చేసే నాయకులు, పార్టీలు ప్రముఖం కావడంతో పోటాపోటీ ఏర్పడింది. అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, బీజేపీ నుంచి సీనియర్‌ నేత మర్రిశశిధర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి కోట నీలిమ బరిలో ఉన్నారు. తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మూడో సారి ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన గతంలో సికింద్రాబాద్‌ అసెంబ్లీ నుంచి పోటీ చేశారు. 2014 నుంచి సనత్‌నగర్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

2018లో ఆయన రెండో సారి ఎమ్మెల్యేగా అదే స్థానం నుంచి గెలిచారు. ఇప్పుడు ఈ నియోజకవర్గం నుంచి మూడో సారి ఆయన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. పాదయాత్రలు, ఆత్మీయ సమావేశాలు, ర్యాలీలు, పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. బూత్‌ కమిటీల సమావేశాలు నిర్వహిస్తున్నారు. మంత్రి కేటీఆర్‌ సైతం  ప్రచారంలో ఆయనకు సహకరిస్తున్నారు. నామినేషన్‌ రోజు భారీ ర్యాలీ నిర్వహించి విపక్షాలకు సవాల్‌ విసిరారు. ప్రచారంలో ప్రత్యర్థుల కంటే ముందున్నారు. ఈసారి గెలుపు తప్పనిసరిగా ఆయన ప్రచారంలో ముందుకెళ్తున్నారు.

ఇక బీజేపీ నుంచి పోటీ చేస్తున్న మరి శశిధర్‌ రెడ్డి వాస్తవానికి మొదటి నుంచీ కాంగ్రెస్‌ నేత. ఆ ముద్ర ఇప్పటికీ ఉంది. ఆయన తండ్రి మర్రి చెన్నారెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేశారు. 1992లో జరిగిన ఉప ఎన్నికలో తండ్రి స్థానంలో శశిధర్‌రెడ్డి పోటీ చేసి గెలుపొందారు. 1992 నుంచి వరుసగా ఆయన ఏడు సార్లు ఈ నియోజకవర్గంలో పోటీ చేశారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మూడు సార్లు ఓడిపోయారు. అయితే.. ఏడు సార్లూ ఆయన కాంగ్రెస్‌ అభ్యర్థిగానే పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేస్తుండడం ఆసక్తిగా మారింది. నియోజకవర్గంతో ఉన్న సంబంధాలు, ఓటర్లతో ఉన్న పరిచయాలు, గతంలో తాను చేసిన అభివృద్ధి పనులు తనకు లాభిస్తాయని ఆయన భావిస్తున్నారు.

నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు పరిస్థితి ఇలా ఉండగా.. కాంగ్రెస్‌ నుంచి మొదటి సారి కోటా నీలిమ సనత్‌నగర్‌ నియోజకవర్గం పోటీ చేస్తున్నారు. ఆమె పోటీ చేయడమే కాదు.. కాంగ్రెస్‌ నుంచి మహిళా అభ్యర్థి ఇక్కడి నుంచి పోటీ చేయడం ఇదే మొదటి సారి. దీంతో ఆమె ఇక్కడి నుంచి గెలవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచే ఆమె ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తూ తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు. సనత్‌నగర్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌కు కంచుకోట అనేది ఆమె ధీమా. కాంగ్రెస్‌కు ఉన్న ఓటు బ్యాంక్‌ తనకు లాభిస్తుందనే ధీమాతో ఉన్నారు. అని, ఇక్కడి నుంచి ఈసారి గెలుస్తామని నమ్మకంతో ఉన్నారు. ఇలా సనత్‌నగర్‌ నియోజకవర్గంలో రాజకీయాలు ఆసక్తిగా మారాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 5 =