బాసర ట్రిపుల్ ఐటీ వద్దకు వెళ్లిన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. పోలీసుల కళ్లుగప్పి కాలినడకన ట్రిపుల్ ఐటీ పరిసరాల్లోకి చేరుకున్న ఆయన గోడ దూకి రహస్యంగా క్యాంపస్‌లోకి ప్రవేశించారు. అనంతరం ట్రిపుల్ ఐటీ విద్యార్థుల వద్దకు చేరుకున్న రేవంత్ రెడ్డి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అయితే దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు, వెంటనే అక్కడకు చేరుకొని ఆయన్ని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, రేవంత్ రెడ్డికి మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. విద్యార్థుల సమస్యలను తెలుసుకోవడానికి వస్తున్న నాయకులను పోలీసులు అడ్డుకుంటున్నారని, అందుకే రహస్యంగా క్యాంపస్‌లోకి ప్రవేశించాల్సి వచ్చిందని తెలిపారు. విద్యార్థుల పట్ల ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోందని, వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.
మరోవైపు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు శుక్రవారం కూడా తమ ఆందోళన కొనసాగించారు. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు ఆందోళనను విరమించే ప్రసక్తే లేదని వారు ప్రకటించారు. బోధనా సిబ్బంది నియామకం, హాస్టళ్లలో మెరుగైన ఆహారం, లైబ్రరీ తెరిచి ఉండే సమయాలను పెంచడంతో పాటు ఇతర సౌకర్యాలు వంటి డిమాండ్‌లతో విద్యార్థులు గడచినా నాలుగు రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అనూహ్యంగా ట్రిపుల్ ఐటీ కొత్త డైరెక్టర్‌గా ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సతీష్ కుమార్‌ను నియమించడాన్ని విద్యార్థులు స్వాగతించారు. ఆయన నియామకాన్ని స్వాగతిస్తున్నామని, క్యాంపస్‌లో ఆయన్ను చూడాలని కోరుకుంటున్నామని, అయితే ఈ నియామకం తమ సమస్యలకు పరిష్కారం కాదని విద్యార్థులు స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ