తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఎంపీలు దేశరాజధాని ఢిల్లీలో ఆందోళన బాట పట్టారు. ఈ మేరకు వారు మంగళవారం పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరసన తెలియజేస్తూ వారు ప్లకార్డులు ప్రదర్శించి, మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజ్యసభలో టీఆర్ఎస్ పక్ష నేత కే కేశవరావు, అలాగే లోక్ సభలో పార్టీ పక్ష నేత నామా నాగేశ్వరరావు సహా ఇతర ఎంపీలు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. దేశంలో రోజు రోజుకూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, ద్రవ్యోల్బణం వంటి వాటికి కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకుంటున్న అసంబద్ధ నిర్ణయాలే కారణమంటూ ఎంపీలు ఆరోపిస్తున్నారు.
కాగా ధరల పెరుగుదల అంశంపై లోక్‌సభ, రాజ్యసభ రెండింటిలోనూ ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని నిలదీశాయి. ఈ క్రమంలో విపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన తెలిపడంతో ఉభయ సభలను మధ్యాహ్నం 2 వరకూ వాయిదా వేశారు. అలాగే దీనికి ముందు ఉదయం పార్లమెంట్ ముందు ప్రతిపక్షాలు నిరసనకు దిగాయి. కాంగ్రెస్ నేత శశిథరూర్ పార్లమెంటు వెలుపల ప్రతిపక్షాల నిరసనలో పాల్గొన్నారు. రూపాయి పతనమవుతున్న తరుణంలో, ప్రజల జీతాలు చితికిపోతున్న తరుణంలో ప్రభుత్వం జిఎస్‌టిని పెంచడం నిజంగా దారుణమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ ఆందోళనలో కాంగ్రెస్ తో పాటు తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, ఆప్ వంటి పార్టీలు పాల్గొన్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ






































