తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ 21 వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు మాదాపూర్ లోని హెచ్ఐసిసిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ప్రతినిధుల నమోదు కార్యక్రమం జరిగింది. అనంతరం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలంగాణ తల్లి విగ్రహానికి నమస్కారం చేసి, పార్టీ పతాకావిష్కరణ చేశారు. పార్టీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ ఎంపీ కే.కేశవరావు స్వాగతవచనం చేశారు. అనంతరం సీఎం కేసీఆర్ ప్లీనరీని ఉద్దేశించి స్వాగతోపన్యాసం చేశారు. ఈ ప్లీనరీ సందర్భంగా 13 తీర్మానాలు ప్రవేశపెట్టి, వాటిపై చర్చించి ఆమోదించనున్నారు.
పార్టీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర మంత్రివర్గం, రాజ్య సభ, లోక్ సభ పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గం, రాష్ట్రస్థాయి కార్పోరేషన్ల చైర్మన్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డిసిసిబి, డిసిఎంఎస్ అధ్యక్షులు, జిల్లా గ్రంథాలయాల సంస్థ అధ్యక్షులు, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు, మహిళా కోఆర్డినేటర్లు, జెడ్పీటిసీ సభ్యులు, మున్సిపల్ మేయర్లు మరియు చైర్మన్లు, మండల పరిషత్ అధ్యక్షులు, పట్టణాల మరియు మండలాల పార్టీ అధ్యక్షులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు పాల్గొన్నారు. అలాగే ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ప్లీనరీకి హాజరయ్యే టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు కోసం భారీగా వంటకాలను సిద్ధం చేశారు. మొత్తం 33 రకాల వెరైటీలతో భోజన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ప్లీనరీలో టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టే తీర్మానాలు ఇవే:
- యాసంగి సీజన్ లో వరి ధాన్యాన్ని కేంద్రం కొనకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నందుకు అభినందన తీర్మానం
- దేశం విస్తృత ప్రయోజనాల రీత్యా జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పార్టీ కీలక భూమిక పోషించాలని ప్రతిపాదన తీర్మానం
- ఆకాశాన్ని అంటేలా పెరిగిన ధరలతో పేద, మధ్యతరగతి ప్రజల మీద మోయలేని భారం వేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసనగా ధరల నియంత్రణకు డిమాండ్ చేస్తూ తీర్మానం
- చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదింప చేసి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం
- భారతదేశ సామరస్య సంస్కృతిని కాపాడుకోవడం, మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని తీర్మానం
- బీసీ వర్గాలకు కేంద్రప్రభుత్వంలో బీసీ సంక్షేమ మంత్రిత్వశాఖ ఏర్పాటు, బీసీ వర్గాల జనగణన జరపాలని డిమాండ్ తో తీర్మానం
- తెలంగాణ రాష్ట్ర సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్ శాతం పెంచాలని, ఎస్సీ వర్గీకరణ తక్షణమే చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం
- రాష్ట్రాల ఆదాయానికి గండి కొడుతూ కేంద్రం పన్నుల రూపంలో కాకుండా సెస్‌ల రూపేణా వసూలు చేయడం మానుకోవాలని డివిజబుల్ పూల్‌లోనే పన్నులు వసూలు చేయాలని తీర్మానం
- నదీ జలాల వివాద చట్టం సెక్షన్-3 ప్రకారం కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్ర వాటాపై ట్రిబ్యునల్‌కు రిఫర్ చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం
- భారత రాజ్యాంగం ప్రతిపాదించిన సమాఖ్య విలువలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిస్తూ తీర్మానం
- తెలంగాణ రాష్ట్రంలో నవోదయ విద్యాలయాలను, వైద్య కళాశాలలను వెంటనే ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం
- దళితబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని తీర్మానం
- చేనేత వస్త్రాలపై కేంద్ర విధించిన జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ