టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ శుక్రవారం నాడు రాజన్న సిరిసిల్ల జిలాల్లో పర్యటిస్తున్నారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రాంభమైంది. అందులో భాగంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మరియు పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి కేటీఆర్ పాల్గొని వారికీ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ వచ్చే ఏప్రిల్ 27 నాటికీ టీఆర్ఎస్ పార్టీ పుట్టి రెండు దశాబ్దాలు నిండి, 21 వ సంవత్సంలోకి అడుగుపెడుతుందన్నారు. తెలుగు రాష్ట్రాల చరిత్ర చూస్తే ఇప్పటికి రెండు ప్రాంతీయ పార్టీలు మాత్రమే నిలదొక్కుకున్నాయన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం 2000 సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీ పుట్టిందన్నారు.
గత ఏడేళ్లలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నో సంచలన విజయాలు నమోదు చేసిందని చెప్పారు. అయితే ఇటీవల కొందరు ఒకట్రెండు గెలిచే ఎగిరిపడుతున్నారని, ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. తమ ఓపికకు, సహనానికి కూడా హద్దులు ఉంటాయని, సందర్భం వచ్చిన నాడు తగిన విధంగా బుద్ధిచెబుతామని హెచ్చరించారు. సహనాన్ని అసమర్థతగా భావించొద్దన్నారు. ఎన్నికలు గెలవచ్చు, ఓడిపోవచ్చు కానీ ఒక లక్ష్యాన్ని సాధించేదాకా ఎన్ని అవాంతరాలు వచ్చినా జెండా దించకుండా కొట్లాడింది ఒక్క టీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని చెప్పారు. 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, కల్యాణలక్ష్మి ఇలా ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి చేకూర్చుతున్నామన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు ఫిబ్రవరి నెలాఖరు లోపుగా పూర్తి చేయాలని, ఈ విషయంలో రాష్ట్రంలో ముందుండేలా చూడాలని స్థానిక పార్టీ శ్రేణులకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ