
తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నకొద్దీ నేతలు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణలో పోటీ చేయనున్నట్లు ప్రచారం జరిగింది. అటు రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అభ్యర్థుల జాబితాను కూడా రెడీ చేశారని వార్తలొచ్చాయి. అయితే ఇప్పటి వరకు కూడా తెలంగాణలో టీడీపీ పోటీ చేసే దిశగా ఒక్క అడుగు కూడా పడలేదు. అటు చంద్రబాబు నాయుడు జైలులో ఉండడంతో తెలంగాణలో టీడీపీని పట్టించుకునే నాధుడే కరువైపోయారు.
మరోవైపు గులాబీ బాస్ వరుసగా బహిరంగ సభలు నిర్వహిస్తూనే.. ఇతర పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నేతలను తామ పార్టీలోకి చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ముదిరాజ్ సామాజిక వర్గంపై కన్నేసిన కేసీఆర్.. ఆ వర్గానికి చెందిన పలువురు దిగ్గజ నేతలను గులాబీ పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇటీవల ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన అంబర్‌పేట్ శంకర్, ఉద్యోగ సంఘాల నేత మామిళ్ల రాజేందర్ బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.
అయితే తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కూడా ముదిరాజ్ సమాజిక వర్గానికి చెందిన వారే. అటు కొద్దిరోజులుగా పట్టించుకునే వారు లేక టీడీపీ అధిష్టానం పట్ల కాసాని జ్ఞానేశ్వర్ గుర్రుగా ఉన్నారు. టీడీపీ ముగిసిన అధ్యాయం అని, చంద్రబాబును నమ్ముకుంటే రాజకీయంగా భవిష్యత్తు ఉండదని.. అతని అనుచరులు కాసానికి సూచిస్తున్నారు. ఈక్రమంలో కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. అంతేకాకుండా ఆయనకు రెండు దిగ్గజ పార్టీల నుంచి ఆఫర్లు కూడా వచ్చినట్లు తెలుస్తోంది.
ముదిరాజ్ సామాజిక వర్గంలో కాసాని జ్ఞానేశ్వర్ బలమైన నేత కావడంతో.. ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు కేసీఆర్ పావులు కదుపుతున్నారట. తమ పార్టీలో చేరితే మల్కాజ్‌గిరి ఎంపీ సీటు లేదా.. అధికారంలోకి వచ్చాక మంత్రి పదవి ఇచ్చేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారట. అటు కాంగ్రెస్ కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు రెడీగా ఉందట. కాసానితో పాటు ఆయన సూచించిన మరో వ్యక్తికి కూడా టికెట్ ఇచ్చేందుకు హస్తం పార్టీ రెడీగా ఉందట. ప్రస్తుతం ఈ వార్తలు తెలంగాణ రాజకీయాలను మరింత హీటెక్కించాయి.
అటు కాసాని రెండు ఆఫర్లు చేతిలో పట్టుకొని కూర్చుకున్నారట. ఏ పార్టీవైపు మొగ్గుచూపాలా అనే డైలమాలో పడిపోయారట. దీనిపై తన అనుచరులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లో కాసాని ఏ పార్టీలో జాయిన్ అవుతారనేది తేలిపోనుందట. మరి కాసాని గులాబీ పార్టీలో జాయిన్ అవుతారా? హస్తం పార్టీ కండువా కప్పుకుంటారా? అనేది చర్చనీయాంశంగా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ