కేంద్ర బడ్జెట్ 2025లో తెలంగాణకు గుండుసున్నా కేటాయించడాన్ని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jagga Reddy) తీవ్రంగా విమర్శించారు. సోమవారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, తెలంగాణ ప్రజల హక్కులను కేంద్రం అనుసంధించిందని, బీజేపీ నేతలు పూర్తిగా వైఫల్యం చెందారని ధ్వజమెత్తారు. ఎన్డీఏ ప్రభుత్వం (NDA Govt) తెలంగాణ ప్రజల పట్ల కపట ప్రేమ చూపిస్తోందని, వారి అవసరం తీరాక రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేస్తున్నదని మండిపడ్డారు.
“రాష్ట్రానికి ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎనిమిది మంది ఎంపీలు ఉన్నా, వారు ఏం సాధించారు?” అంటూ బీజేపీ ఎంపీలపై నిప్పులు చెరిగిన జగ్గారెడ్డి, తెలంగాణ ప్రజలు ఏటా రూ. లక్ష కోట్లకు పైగా పన్నులు చెల్లిస్తే, తిరిగి రాష్ట్రానికి కేంద్రం ఏమాత్రం నిధులు కేటాయించలేదని ఆరోపించారు.
తెలంగాణ బీజేపీ నేతలపై ఆగ్రహం
తెలంగాణ బీజేపీ (Telangana BJP) నేతలు అవసరంలేని వాగ్వాదాలకు మాత్రమే పరిమితమయ్యారని ఎద్దేవా చేసిన జగ్గారెడ్డి, కేంద్రం చేస్తున్న అన్యాయంపై కాంగ్రెస్ తరపున తీవ్ర పోరాటం చేపడతామని ప్రకటించారు. బీజేపీ పాలనలో తెలంగాణకు అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని, యూపీఏ హయాంలో హైదరాబాద్ మౌలిక వసతులు అభివృద్ధి చెందడం వల్లే రాష్ట్ర బడ్జెట్ రూ. మూడు లక్షల కోట్లకు చేరిందని గుర్తు చేశారు.
కేంద్ర మంత్రులకు జగ్గారెడ్డి సవాల్
“కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాష్ట్రానికి ప్రత్యేక నిధులు తీసుకురాలేకపోతే, ప్రజలకు క్షమాపణ చెప్పాలి. లేకపోతే, రాష్ట్రానికి తగిన నిధులు తెచ్చి తమ నిజాయితీని నిరూపించుకోవాలి” అంటూ జగ్గారెడ్డి వారిపై సవాల్ విసిరారు. బిహార్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని కేంద్ర బడ్జెట్ రూపొందించారని, ఇది దేశ బడ్జెట్ కాదని తీవ్ర విమర్శలు గుప్పించారు.
తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తూ కేంద్ర బడ్జెట్ రూపొందించడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించిందని, భవిష్యత్తులో తెలంగాణ హక్కుల కోసం మరింత తీవ్రంగా పోరాడుతామని స్పష్టం చేశారు.