కాకినాడ జిల్లాలో శనివారం మధ్యాహ్నం పెను విషాదం చోటుచేసుకుంది. సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలోని ఒక బాణసంచా తయారీ కేంద్రంలో సంభవించిన భారీ పేలుడు వల్ల సుమారు 20 మంది సజీవదహనమయ్యారు. ఈ ఘోర ప్రమాదం స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది.
వేట్లపాలెం మరియు జి.మేడపాడు గ్రామాల మధ్య ఉన్న ‘సూర్యశ్రీ ఫైర్వర్క్స్’ అనే యూనిట్లో శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో కార్మికులు బాణసంచా తయారు చేస్తుండగా ఈ పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రత ఎంతలా ఉందంటే, ఆ శబ్దం సుమారు 5 కిలోమీటర్ల వరకు వినిపించిందని, మృతదేహాలు గాల్లోకి ఎగిరి పక్కనే ఉన్న పొలాల్లో పడ్డాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
మరణించిన వారిలో అత్యధికులు మహిళా కార్మికులే ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. మరో 8 మందికి పైగా కార్మికులు తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాద విషయం తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న ఆయన, అక్కడి నుంచే అధికారులతో ఫోన్లో సమీక్ష నిర్వహించి సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. హోంమంత్రి వంగలపూడి అనితను తక్షణమే ఘటనా స్థలానికి వెళ్లాలని కోరారు.
ప్రభుత్వం తరపున బాధితులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రధాని మోదీ కూడా ఈ ప్రమాదంపై ఆవేదన వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే, లోపల ఉన్న ముడి పదార్థాల వల్ల పేలుళ్లు కొనసాగుతుండటంతో సహాయక చర్యలకు కొంత ఆటంకం కలిగింది.
ఈ పరిశ్రమకు సరైన అనుమతులు లేవని, నిబంధనలకు విరుద్ధంగా జనసంచారం లేని పొలాల్లో దీన్ని నిర్వహిస్తున్నారని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. గతంలో కూడా ఇదే ప్రాంతంలో ఇలాంటి ప్రమాదాలు జరిగిన నేపథ్యంలో, భద్రతా ప్రమాణాల పాటించని ఇలాంటి కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.








































