ఆంధ్రప్రదేశ్‌లో కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) పరిధిలో ఉన్న అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. పాత పెన్షన్ విధానం (OPS)లోకి మారేందుకు గతంలో ప్రకటించిన వన్‌టైమ్ ఆప్షన్‌కు సంబంధించి తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ G.O.Ms.No.158ను నవంబర్ 9న జారీ చేసింది. గతంలో ప్రకటించిన G.O.Ms.No.53 అమలుకు సంబంధించిన దరఖాస్తు విధానం, పత్రాల సమర్పణ, పరిశీలన ప్రక్రియపై స్పష్టత ఇచ్చింది.
ఎవరికి వర్తిస్తుంది?
2004 సెప్టెంబర్ 1కు ముందే ఉద్యోగ నియామక నోటిఫికేషన్ లేదా ప్రకటన విడుదలై, ఆ తర్వాత ప్రభుత్వ సర్వీసులో చేరి ప్రస్తుతం CPS పరిధిలో ఉన్న ఉద్యోగులు ఈ అవకాశానికి అర్హులు కావచ్చు. గతంలో జారీ చేసిన ఉత్తర్వుల్లోని అర్హత నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. ఈ వెసులుబాటు అర్హులైన సర్వీసులో ఉన్న ఉద్యోగులతో పాటు రిటైర్డ్ ఉద్యోగులు, మరణించిన ఉద్యోగుల అర్హ కుటుంబ సభ్యులకు కూడా వర్తిస్తుందని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
నిధి పోర్టల్ ద్వారా దరఖాస్తు
అర్హులు CPS నుంచి OPSకు మారేందుకు NIDHI పోర్టల్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు ముందు ప్రారంభ నియామక అధికారి (Initial Appointing Authority) నుంచి నాలుగు పత్రాల ధ్రువీకరించిన కాపీలు పొందాలి. అవి నియామక ప్రకటన, ఎంపిక జాబితా, నియామక ఉత్తర్వులు, విధుల్లో చేరినట్లు తెలిపే ఉత్తర్వులు. సంబంధిత అధికారి అభ్యర్థన అందిన 15 పని దినాల్లో పత్రాలను అందించాల్సి ఉంటుంది. అనంతరం ఉద్యోగులు వాటిని నిధి పోర్టల్‌లో అప్లోడ్ చేసి తమ కార్యాలయ DDOకు దరఖాస్తు సమర్పించాలి.
డిసెంబర్ 31 వరకు గడువు
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులైన ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, కుటుంబ పెన్షన్ లబ్ధిదారులు 2026 డిసెంబర్ 31లోపు తమ వన్‌టైమ్ ఆప్షన్‌ను సమర్పించాలి. దరఖాస్తు సమర్పించడం మాత్రమే OPS ఆమోదం కాదని, సంబంధిత అధికారులు పత్రాలను పరిశీలించి తుది ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నిర్ణయంతో CPS నుంచి OPSకు మారేందుకు ఎదురుచూస్తున్న అర్హులైన ఉద్యోగులకు దరఖాస్తు ప్రక్రియపై స్పష్టత లభించింది.








































