ఖమ్మం జిల్లాలోని 2.54 లక్షల ఎకరాల సాగర్ ఆయకట్టు భూములకు సరిపడు సాగు నీటిని పాలేరు రిజర్వాయర్ నుంచి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విడుదల చేశారు. శ్రీశైలం జలాశయం నిండిన వెంటనే నాగార్జున సాగర్ జలాశయానికి నీటిని విడుదల చేయాలని, ఇప్పటికే 225 టీఎంసీల నీటి నిల్వ సాగర్ జలాశయంలో ఉన్నందున ఖమ్మం జిల్లాకు సాగునీటిని ఇవ్వాలని మంత్రి పువ్వాడ ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన విషయం విధితమే. ఖమ్మం జిల్లాలో వానాకాలం పంటల సాగుకు 24.611 టీఎంసీలు కేటాయించారని, వార బందీ విధానంలో కాలువలకు నీటిని విడుదల చేసి, ఆయకట్టు చివరి భూములకు సైతం నీటిని అందించాలని మొన్న జరిగిన జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశంలో మంత్రి అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ, ఈ ఏడాది సాగర్ ఆయకట్టుకు ముందుగానే సాగునీటిని విడుదల చేసినట్లు తెలిపారు. ఆయకట్టులోని ప్రతి ఎకరానికి సాగునీరు అందాలని, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఖరీఫ్ సీజన్‌లో సాగర్ నీటిని అందించాలని మంత్రి అన్నారు. సెప్టెంబర్ 3వ తేదీ వరకు నిరాటంకంగా 23 రోజులు ఆయకట్టుకు నీరు సరఫరా చేస్తారని, ఆ తర్వాత ఆరు రోజులు సరఫరా ఆపేసి తర్వాత మళ్ళీ 9 రోజుల పాటు నీటిని విడుదల చేస్తారని, ఈ విధంగా అవసరం మేరకు నీటి తడులు అందిస్తామన్నారు. వ్యవసాయ పనులు ముమ్మరం అవుతున్నందున కావాల్సిన ఎరువులు సిద్ధంగా ఉంచాలని ఇప్పటికే అధికారులకు తగు సూచనలు చేయడమైందని పేర్కొన్నారు. సాగర్ ఆయకట్టుకు సాగునీరు సరఫరాకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేయాలని చివరి ఎకరాకు సాగునీటిని అందిస్తామని అన్నారు. సతుపల్లిలో చివరి ఎకరాకు నీరు చేరేందుకు 2 రోజుల సమయం పడుతున్నందున ప్రతి ఎకరా తడిచే విధంగా అధికారులు పర్యవేక్షించాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, రాములు నాయక్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, రైతు బంధు జిల్లా కో-ఆర్డినేటర్ నల్లమల వెంకటేశ్వర రావు, వ్యవసాయ, ఎన్ఎస్పీ, ఇరిగేషన్ అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu