బ‌యో ఏషియా-2021: భారత్‌ బయోటెక్‌ సీఎండీ, జేఎండీలకు అవార్డులు ప్రదానం

Minister KTR Inaugurates BioAsia-2021 Virtual Conference Today

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తున్న బ‌యో ఏషియా-2021 స‌ద‌స్సును రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌లు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం నాడు ప్రారంభించారు. హైదరాబాద్ లోని ఐటీసీ కాకతీయ హోటల్‌ లో ప్రారంభమైన ఈ 18 వ ఎడిషన్ బయో ఏషియా సదస్సును ఈసారి “మూవ్‌ ద నీడిల్‌” థీమ్‌తో నిర్వహిస్తున్నారు. రెండు రోజుల పాటుగా వ‌ర్చువ‌ల్ విధానంలో జరగనున్న స‌ద‌స్సులో ప్రపంచంలోని పలుదేశాల నుంచి నుంచి జీవ‌శాస్త్ర నిపుణులు, ఫార్మా, లైఫ్ సైన్సెస్ కంపెనీల ప్ర‌తినిధులు పాల్గొని ఫార్మా, ఆరోగ్య రంగాల అభివృద్ధి, పరిశోధనలపై చర్చించనున్నారు. ఈ రోజు కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ సహా ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ జ‌యేశ్ రంజ‌న్‌, లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్, లైఫ్ సైన్సెస్ అడ్వైజరి కమిటీ చైర్మన్ సతీష్ రెడ్డి, పలువురు ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

భారత్‌ బయోటెక్‌ సీఎండీ, జేఎండీలకు జీనోమ్ వ్యాలీ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డులు:

ఈ సంద‌ర్భంగా పూర్తి స్వదేశీ సామర్ధ్యంతో కొవాగ్జిన్‌ కరోనా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసిన హైదరాబాద్ కు చెందిన భార‌త్ బ‌యోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లా, జాయింట్ ఎండీ సుచిత్ర ఎల్లాకు జీనోమ్ వ్యాలీ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డుల‌ను మంత్రి కేటీఆర్ అందజేశారు. అనంతరం మ‌ంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ప్ర‌పంచ టీకాల రాజ‌ధానిగా హైద‌రాబాద్ మారిందని పేర్కొన్నారు. దేశీయ కరోనా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేయడంలో భార‌త్ బ‌యోటెక్ సంస్థ చేసిన కృషి గర్వకారణమని అన్నారు. హైద‌రాబాద్ నగరంలో ఫార్మారంగ బ‌లోపేతానికి ప్రభుత్వం నుంచి మరింత కృషి చేస్తామ‌ని మంత్రి కేటీఆర్ చెప్పారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ