జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విజయవాడ జనసేన కార్యాలయంలో ఈ రోజు సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఇసుక కొరత, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సోమవారం జరిగిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. 151 ఎమ్మెల్యేలున్న పార్టీ, ఒక్క ఎమ్మెల్యే ఉన్న జనసేన పార్టీకి భయపడే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మాట్లాడితే మూడు పెళ్లిళ్లు చేసుకున్నా అంటున్నారని, మీరు కూడా చేసుకోండి ఎవరు వద్దన్నారన్నారు. అలాగే తాను చేసుకున్న మూడు పెళ్లిళ్ల వల్లే రెండేళ్ల పాటు జైలుకు వెళ్లారా అని సీఎం జగన్ ను ఉద్దేశిస్తూ ప్రశ్నించారు. జగన్ ఫ్యాక్షనిస్టు ధోరణికి తాను భయపడనని పవన్ కళ్యాణ్ అన్నారు.
రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపై కూడ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రపై సీఎం జగన్‌కు అవగాహన ఉందా అని ఈ సందర్భంగా ప్రశ్నించారు. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో భాషా ప్రయుక్త రాష్ట్రం ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఉపాధ్యాయులకు ఇంగ్లీష్ లో శిక్షణ ఇవ్వకుండా పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే ఎలా అని ప్రశ్నించారు. ప్రాథమిక దశలో ఉండే విద్యార్థులు ఈ నిర్ణయంతో దెబ్బ తింటే రెంటికీ చెడ్డ రేవడి అయిపోతారు, అప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారని అన్నారు. ఉపాధ్యాయులకు పూర్తిగా శిక్షణ ఇచ్చాకే రాష్ట్రంలో కొన్ని జిల్లాలను, కొన్ని స్కూల్స్ తీసుకుని ఆరు నెలలు పైలట్ ప్రాజెక్టు కింద ఇంగ్లీష్ మీడియాన్ని అమలు చేయాలని కోరారు. అనంతరం పునరాలోచన చేసుకోని రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.
[subscribe]



