ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ ను ఢిల్లీ ప్రభుత్వం త్వరలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్న ‘దేశ్ కే మెంటార్స్’ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం నాడు ప్రకటించారు. ముందుగా సోనూసూద్ శుక్రవారం ఉదయం సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో భేటీ అయ్యారు. భేటీ అనంతరం వారిద్దరూ ఉమ్మడిగా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ, కరోనా మహమ్మారి సంక్షోభం సమయంలో సోనూసూద్ వ్యక్తిగత స్థాయిలో చేపట్టిన భారీ సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. అలాగే ఢిల్లీ ప్రభుత్వం తీసుకువస్తున్న దేశ్ కే మెంటార్స్ దేశంలోనే అతిపెద్ద మార్గదర్శక కార్యక్రమం కాబోతుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా 10 లక్షల మంది ఢిల్లీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు, సుమారు 3 లక్షల మంది యువ నిపుణులు మార్గదర్శకత్వం చేయబోతున్నారని అన్నారు. ఈ గొప్ప కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండడానికి సోనూ సూద్ అంగీకరించారని సీఎం కేజ్రీవాల్ తెలిపారు.
నటుడు సోనూసూద్ మాట్లాడుతూ, ఈ రోజు లక్షలాది మంది విద్యార్థులకు మార్గనిర్దేశం చేసే అవకాశం తనకు లభించిందన్నారు. విద్యార్థులకు మార్గనిర్దేశం చేయడం కంటే గొప్ప సేవ మరొకటి లేదని, ఖచ్చితంగా కలిసి పనిచేస్తామని చెప్పారు. అలాగే సీఎం కేజ్రీవాల్ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను సోనూసూద్ ప్రశంసించారు. దేశ రాజధాని ఢిల్లీ విద్యకు ఆదర్శవంతమైన నమూనాగా మారుతుందన్నారు. ఇక తమ భేటీ సందర్భంగా రాజకీయ అంశాలపై ఎలాంటి చర్చలు జరగలేదని సోనూసూద్ వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ