తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్స్‌లకు నవంబర్ 9 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించిన సంగతి తెలిసిందే. కాగా దరఖాస్తుల స్వీకరణ గడువు నేటితో (నవంబర్ 18, గురువారం) ముగియనుంది. నవంబర్ 17 వరకు మొత్తం 23 వేలకు పైగా దరఖాస్తులు రాగా, బుధవారం ఒక్కరోజే దాదాపు 9 వేల దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే గురువారమే చివరి రోజు కావడంతో దరఖాస్తులు మరింత భారీగా వచ్చే అవకాశం ఉంది. మరోవైపు దరఖాస్తు గడువు పొడిగించే అంశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నట్టు సమాచారం.
ముందుగా డిసెంబర్ 1 తేదీ నుంచి అమల్లోకి వచ్చే నూతన మద్యం విధానంలో భాగంగా రాష్ట్రంలో మరో 404 మద్యం దుకాణాలను పెంచుతున్నట్టు రాష్ట్ర ఆబ్కారీ శాఖ వెల్లడించింది. కొత్తగా పెంచిన 404 దుకాణాలతో కలిపి రాష్ట్రంలో మొత్తం మద్యం దుకాణాల సంఖ్య 2,620కి పెరిగింది. కాగా మద్యం దుకాణాల్లో గౌడ్లకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లకు అనుగుణంగా గౌడ్ లకు 363, ఎస్సీలకు 262, ఎస్టీలకు 131 కలిపి రాష్ట్రంలో మొత్తం 756 దుకాణాల కేటాయింపు పూర్తిచేశారు. ఓపెన్ కేటగిరీ కింద మిగిలిన 1,864 మద్యం దుకాణాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ముందుగా ప్రకటించిన విధంగా నవంబర్ 20న ఆయా జిల్లాల కలెక్టర్ల సమక్షంలో డ్రా విధానం ద్వారా ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి ఓపెన్ కేటగిరీ మద్యం దుకాణాలను కేటాయించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ