తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకోస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణకు మరో పెట్టుబడి వచ్చి చేరింది. డైరీ రంగంలో ప్రఖ్యాత కంపెనీగా ఉన్న దేశీయ డెయిరీ దిగ్గజం అమూల్ తెలంగాణలో రూ.500 కోట్ల పెట్టుబడితో తమ అతిపెద్ద స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు బుధవారం నాడు హైదరాబాద్‌లో తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఇందుకు సంబంధించిన ఎంఓయూపై ప్రభుత్వం, అమూల్ మధ్య సంతకాలు జరిగాయి. ఫేజ్-1లో సుమారు రూ.300 కోట్లు మరియు ఫేజ్-2లో రూ.200 కోట్ల పెట్టుబడితో తెలంగాణలోని స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్‌లో ఈ ప్లాంట్ రానుంది. ఈ ప్లాంట్ ద్వారా 500 మందికిపైగా ప్రత్యక్ష ఉపాధి లభించడంతో పాటుగా, అనేక అనుబంధ పరిశ్రమలకు అవకాశాలను అందిస్తుందని తెలిపారు.
దక్షిణ భారతదేశంలో అమూల్ ఏర్పాటు చేయనున్న తొలి అతి పెద్ద ప్లాంట్ ఇదే కానుంది. ప్యాక్డ్ మిల్క్ మరియు పెరుగు, మజ్జిగ, లస్సీ, పెరుగు, పనీర్, స్వీట్స్ వంటి వాల్యూ యాడెడ్ డైరీ ఉత్పత్తులను తయారు చేసేందుకు రోజుకు 5 లక్షల లీటర్ల పాలను 10 ఎల్‌ఎల్‌పీడీకి విస్తరించే సామర్థ్యంతో ఈ ప్లాంట్ స్థాపనకు అమూల్ పూనుకుంది. బ్రెడ్‌లు, బిస్కెట్లు, సాంప్రదాయ స్వీట్లు మరియు బేక్డ్ స్నాక్స్ వంటి ఉత్పత్తుల శ్రేణితో అమూల్ తన బేకరీ ఉత్పత్తి విభాగాన్ని కూడా తెలంగాణలో ఏర్పాటు చేయనుంది. తెలంగాణ రాష్ట్రంలో తమ అతిపెద్ద ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినందుకు అమూల్ సంస్థ నాయకత్వ బృందానికి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, ఫుడ్ ప్రాసెసింగ్ డైరెక్టర్ అఖిల్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ