ఫిబ్రవరి 16 నుండి 19 వరకు మేడారం మహాజాతర, ఏర్పాట్లపై సీఎస్, డీజీపీ టెలీ కాన్ఫరెన్స్

CS Somesh Kumar, DGP Mahender Reddy Held Teleconference on Medaram Jathara Arrangements

రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు మేడారం జాతర ఏర్పాట్లపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి లు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో పోలీసు, రెవిన్యూ, గిరిజన, దేవాదాయ, వైద్య ఆరోగ్య, మున్సిపల్, పంచాయితీ రాజ్, గ్రామీణ మంచినీటి సరఫరా, విధ్యుత్, పశు సంవర్ధక శాఖ, రోడ్లు భవనాలు, నీటిపారుదల, ఆర్టీసీ తదితర విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరైనా మేడారం జాతర ఈ నెల 16వ తేదీ నుండి 19 వరకు జరుగుతుంది. ఈసారి కూడా కోటి మందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా. ఈ జాతరకు హాజరయ్యే వారికి ఏవిధమైన ఇబ్బందులు రావొద్దని సీఎం కేసీఆర్ ఆదేశించినందున అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి. శుక్రవారం ఉదయం జంపన్న వాగులోకి నీరు విడుదల చేసాం. దేవాదాయ, ఇంజనీరింగ్ విభాగాల పనులన్నీ దాదాపుగా పూర్తి కావొచ్చాయి. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఏవిధమైన ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టాలి. మేడారం పూజారులు, ట్రస్టు బోర్డు సభ్యులతో కలసి పనిచేయాలి. జాతరకు వచ్చే భక్తులు సంతృప్తికరంగా దర్శనం చేసుకొని క్షేమంగా వెళ్లేవిధంగా చర్యలు చేపట్టాలని చెప్పారు.

“ఆర్టీసీ ద్వారా 3850 బస్సులు నడిపి 21 లక్షల మంది ప్రయాణికులను చేరవేసేందుకు చర్యలు తీసుకున్నాం. మేడారంలో ప్రధాన ఆసుపత్రి ఏర్పాటుతోపాటు మరో 35 హెల్త్ క్యాంపుల ఏర్పాటు చేశాం. ఫుడ్ సేఫ్టీ అధికారుల నియామకం చేపట్టాం. రోడ్లు భవనాల శాఖ ద్వారా రోడ్ల నిర్మాణం, మరమత్తులు పూర్తిచేయడంతో పాటుగా 327 లొకేషన్లలో 6700 టాయిలెట్ల నిర్మాణం, స్నాన ఘట్టాల ఏర్పాటు జరిగింది. అంటువ్యాధులు, నీటి కాలుష్యం కాకుండా ఉండేందుకై నిరంతరం క్లోరినేషన్, నిరంతర విధ్యుత్ సరఫరా, అదనపు సబ్ స్టేషన్లు, ట్రాంఫార్మర్లను ఏర్పాటు చేసాం. అలాగే జాతరలో 18 ప్రాంతాల్లో తప్పిపోయిన పిల్లల క్యాంపుల ఏర్పాటు చేశాం. శానిటేషన్ పర్యవేక్షణకై 19 జిల్లాల పంచాయితీ రాజ్ అధికారుల నియామకం జరగగా, పంచాయితీ రాజ్ శాఖ నుండి 5000 వేల మంది సిబ్బంది పాల్గొననున్నారు” అని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు.

డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, జాతరను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసిందన్నారు. విస్తృత బందోబస్తు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, తొక్కిసలాట కాకుండా గతంలో అనుభవం ఉన్న పోలీస్ అధికారులను విధుల్లో నియమించామని, దాదాపు 9000 మంది పోలీసు అధికారులను విధుల్లో నియమించినట్టు తెలిపారు. ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుతో పాటుగా ఫైర్ ఇంజన్లను సరిపడా అందుబాటులో వుంచుతున్నామని చెప్పారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో స్పెషల్ సీఎస్ లు ఆధార్ సిన్హా, రజత్ కుమార్, అర్వింద్ కుమార్, ముఖ్య కార్యదర్శులు వికాస్ రాజ్, జయేష్ రంజన్, కార్యదర్శులు రిజ్వీ, క్రిస్టినా చోంగ్తు, శ్రీనివాస రాజు, ఎండోమెంట్ కమీషనర్ అనిల్ కుమార్, అడిషనల్ డీజీ జితేందర్, ఐజి లు నాగి రెడ్డి, సంజయ్ జైన్, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్.పి.ఐ. సంగ్రామ్ సింగ్ పాటిల్, వివిధ ఇంజనీరింగ్ విభాగాల ఈ.ఎన్.సిలు పాల్గొన్నారు .

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − 18 =