ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన డీజీపీగా ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న కసిరెడ్డి వి రాజేంద్రనాథ్ రెడ్డికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం నాడు మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ నుంచి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన డీజీపీకి గౌతమ్ సవాంగ్ శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ప్రజల విశ్వాసం చూరగొనేలా పని చేస్తానని పేర్కొన్నారు. ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా పోలీస్ శాఖ పని చేస్తుందని చెప్పారు. ప్రజల ధన, మాన, ప్రాణాలు రక్షించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని అన్నారు. రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల సహకారంతో కుల, మత, వర్గ విభేదాలు పరిష్కరిస్తామన్నారు. అలాగే గంజాయి సాగును అరికట్టడంతో పాటుగా ఎర్రచందనం స్మగ్లింగ్ వంటి వాటిని కూడా పూర్తిస్థాయిలో అదుపు చేస్తామని తెలిపారు. ఇక రాబోయే రోజుల్లో జిల్లాల విభజన జరగనున్న దృష్ట్యా పోలీసు అధికారుల కేటాయింపుపై కూడా కసరత్తు చేస్తామని డీజీపీ రాజేంద్రనాథ్ స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ