భద్రాద్రిలో ఏప్రిల్ 10 జరగనున్న శ్రీరామనవమి వేడుకలపై రాష్ట్ర దేవాదాయ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవాన్ని ఈ ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఏప్రిల్ 10న శ్రీరామనవమిని పురస్కరించుకుని కళ్యాణోత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులను కూడా అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు. గత రెండు సంవత్సరాలు కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలోనే కరోనా నిబంధనలకు అనుగుణంగా శ్రీరాముని కళ్యాణ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించామన్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో వేడుకలను భక్తుల సమక్షంలో కనులపండుగలా నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.
భద్రాద్రిలో కళ్యాణ మహోత్సవం నిర్వహించే మిథిలా స్టేడియాన్ని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దాలని దేవాదాయ శాఖ కమిషనర్ కు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని, ఆలయ పరిసరాల్లో వెదురు తడికలతో కూడిన చలువ పందిళ్లను నిర్మించాలని సూచించారు. మరోవైపు ఏప్రిల్ 2వ తేదీన శుభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా ప్రభుత్వ ఆద్వర్యంలో పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ