జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై జనవరి 11, శనివారం నాడు కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కాకినాడ భానుగుడి సెంటర్‌లో జనసేన పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అనంతరం ఎమ్మెల్యే ద్వారంపూడి నివాసాన్ని ముట్టడించేందుకు బయలుదేరిన జనసేన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొందరు కార్యకర్తలు ఎమ్మెల్యే ఇంటి వద్దకు చేరుకోవడంతో వారిపై వైసీపీ వర్గీయులు రాళ్లు, కర్రలతో దాడికి దిగారు. వైసీపీ, జనసేన వర్గీయులు పరస్పరం దాడులకు దిగడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
ఈ ఘర్షణలో పలువురు జనసేన కార్యకర్తలకు గాయాలయినట్టుగా తెలుస్తుంది. అనంతరం కొందరు జనసేన నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మరోవైపు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిపై జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ నాయకులు శనివారం రాత్రి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని, కేసు నమోదు చేయాలని కోరారు.
[subscribe]