దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో రెండవ రోజున తెలంగాణ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి కే. తారక రామారావు పలు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల సీనియర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణ పెవిలియన్ లో జరిగిన ఈ సమావేశాల్లో పలు కంపెనీల సీఈవోలు, గ్రూప్ చైర్మన్లు పాల్గొన్నారు. అలాగే అక్కడ జరిగిన ఒక బిజినెస్ మీటింగ్ లో గూగుల్ మరియు ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ తో మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో గూగుల్ కార్యకలాపాలతో పాటు, గూగుల్ భవిష్యత్తు విస్తరణ పైన ఈ సందర్భంగా చర్చించారు.
అదేవిధంగా ప్రపంచ ప్రఖ్యాత ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ కంపెనీ అయిన బే సిస్టమ్స్ చైర్మన్ సర్ రోజర్ కార్ మంత్రి కేటీఆర్ ని కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ రంగాలు ప్రాధాన్యత రంగాలని బే సిస్టమ్స్ చైర్మన్ కు కేటీఆర్ తెలియజేశారు. ఇప్పటికే అనేక ప్రపంచ ప్రఖ్యాత ఏరోస్పేస్, డిఫెన్స్ కంపెనీలు హైదరాబాద్ నుంచి తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్న విషయాన్ని వివరించారు. రాక్ వెల్ అటోమేషన్ సీఈవో మరియు ప్రెసిడెంట్ బ్లేక్ డి మారెట్ కూడా మంత్రి కేటీఆర్ ను కలిశారు.
అలాగే 230 సంవత్సరాల చరిత్ర కలిగిన జపాన్ ఫార్మా దిగ్గజం టకెడా ఫార్మా వాక్సిన్ బిజినెస్ యూనిట్ అధ్యక్షులు రాజీవ్ వెంకయ్య కేటీఆర్ తో సమావేశం అయ్యారు. హైదరాబాద్ ఇండియా యొక్క లైఫ్ సైన్సెస్ మరియు ఫార్మా రంగానికి రాజధానిగా ఉన్నదని, తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీలో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించారు. ఇంకా రెండో రోజు సమావేశాల సందర్భంగా మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ పవన్ కె గోయాంక, కెపిఎంజి గ్లోబల్ చైర్మన్ మరియు సీఈవో బిల్ థామస్, ఐడీఈవో సీఈవో సాండీ స్పైచర్, హెచ్ సీఎల్ టెక్నాలజీస్ సీటివో కళ్యాణ్ కుమార్ లు సైతం మంత్రి కేటీఆర్ తో సమావేశం అయ్యారు.
[subscribe]