భారతీయ సంగీత లోకం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. దాదాపు ఐదు దశాబ్దాలపాటు తన గాత్రంతో యావత్ సంగీతాభిమానులను అలరించిన భారతీయ దిగ్గజ గజల్ గాయకుడు భూపీందర్ సింగ్ కన్నుమూశారు. కోలన్ కేన్సర్, కోవిడ్ అనంతర సమస్యలతో ముంబై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. అయితే యూరిన్ ఇన్‌ఫెక్షన్‌తో పది రోజుల కిందట ఆస్పత్రిలో చేరిన భూపీందర్‌కు, ఆ తర్వాత కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అప్పటినుంచి చికిత్స తీసుకుంటున్న ఆయన నిన్న రాత్రి మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. 82 సంవత్సరాల భూపీందర్ సింగ్.. అలనాటి బాలీవుడ్ ప్రముఖులు మోహమ్మద్ రఫీ, ఆర్డీ బర్మాన్, మదన్ మోహన్, లతా మంగేష్కర్, గుల్జార్‌లకు సమకాలీకుడు.
ఇక బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భూపిందర్ పలు హిట్ పాటలను ఆలపించారు. దో దివానే షెహర్ మే, ఏక్ అకేలా ఇస్ షెమర్ మే, తోడీ సీ జమీన్ తోడా ఆస్మాన్, దునియా చుటే యార్ నా చుటే, కరోగి యాద్ తో లాంటి ఎన్నో అద్భుతమైన గీతాలకు ఆయన తన గాత్రాన్నిచ్చారు. అలాగే ఆయన మంచి గిటారిస్ట్ కూడా. బాలీవుడ్ అల్ టైం క్లాసిక్ హిట్స్.. దమ్ మారో దమ్, చురా లియా హై, చింగారి కోయి బడ్కే, మెహబూబా ఓ మెహబూలా లాంటి పాటలకు ఆయన గిటారిస్ట్‌గా పని చేయడం విశేషం. మరో ప్రముఖ సంగీతకారుడు, స్వరకర్త బప్పిలహరితో కలిసి ఆయన ఎన్నో సినిమాలకు పనిచేశారు. కాగా ఆయన భార్య మిథాలీ సింగ్ ప్రముఖ గాయకురాలు.
భూపీందర్ సింగ్ మొదట ఢిల్లీ లోని ఆల్ ఇండియా రేడియోలో సింగర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అనంతరం ప్రముఖ సంగీత దర్శకుడు మదన్ మోహన్ ద్వారా సినిమా అవకాశాలు అందుకున్నారు. 1964లో చేతన్ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన హఖీఖాత్ ఆయన తొలి చిత్రం. ఆ తర్వాత సుమారు 2 దశాబ్దాలు సినీ రంగంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన భూపీందర్.. 1980ల దశకం నుంచి సినిమాలకు క్రమంగా దూరం అయ్యి, భార్య మిథాలీతో కలిసి ప్రైవేట్ ఆల్బమ్స్ మరియు అనేక ప్రదర్శనలు ఇచ్చారు. కాగా భూపీందర్ సింగ్ మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం చెబుతున్నారు. ఆయన మృతి పట్ల మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే నివాళి అర్పిస్తూ ఓ సంతాప ప్రకటన విడుదల చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ