గోదావరికి వచ్చిన భారీ వరదల కారణంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరు రాష్ట్రాలలో గోదావరి పరివాహక ప్రాంతాలలో అనేక చోట్ల పలు గ్రామాలు నీట మునిగాయి. ఈ క్రమంలో ఏపీలో నిర్మాణంలో భారీ ఇరిగేషన్ ప్రాజెక్టు పోలవరంపై తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. పోలవరం ప్రాజెక్టు వలన భద్రాచలానికి ముప్పు పొంచి ఉందని మంత్రి అజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ప్రాథమిక డిజైన్ ప్రకారం కాకుండా దానిని మార్చి మరో మూడు మీటర్లు ఎత్తు పెంచిందని, దీని కారణంగానే భద్రాచలానికి పెద్ద ఎత్తున వరద వచ్చిందని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు.
భద్రాచలానికి ఈ ప్రాజెక్టు కారణంగా భవిష్యత్తులో కూడా ఎప్పుడైనా వరదలు రావొచ్చని, దానిని నివారించాలంటే ఆ ప్రాజెక్టు ఎత్తు తగ్గించాల్సిందేనని పువ్వాడ స్పష్టం చేశారు. దీనికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని, పోలవరం ఎత్తు తగ్గించేలా ఏపీని కేంద్రమే బాధ్యత తీసుకుని ఒప్పించాలని కోరారు. ఏపీ నుంచి కూడా ముంపు భాదితులు వచ్చి తమ పునరావాస శిబిరాల్లో తలదాచుకున్నారని, ముఖ్యంగా భద్రాచలం పక్కనే ఉన్న 5 గ్రామాలను తెలంగాణలో కలపాలని కేంద్రాన్ని కోరారు. పోలవరం నిర్మాణం సమయంలో తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపినప్పుడు తాము నిరసన తెలిపామని, ఏపీలో విలీనం అయిన ఆ 7 మండలాలను తిరిగి తెలంగాణలో కలపాలని మంత్రి పువ్వాడ డిమాండ్ చేశారు.
అయితే మంత్రి పువ్వాడ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. భద్రాచలం వద్ద ఇటీవల వచ్చిన వరద పరిస్థితులకు పోలవరం కారణమని పువ్వాడ అనడాన్ని ఆయన తప్పుపట్టారు. మంత్రి అజయ్ అనవసర విమర్శలు మానుకోవాలని, ఆంధ్రప్రదేశ్లో విలీనమైన గ్రామాల ప్రజల బాగోగుల కోసం ఏమి చేయాలో తమకు తెలుసునని స్పష్టం చేశారు. విలీన గ్రామాలను తెలంగాణలో విలీనం చేస్తే ఏపీని కూడా కలిపేయాలని మేము అడుగుతాం. అలాగే రాష్ట్రం విడిపోవడం వలన హైదరాబాద్ ద్వారా రావాల్సిన ఆదాయం రాక ఏపీ ఇబ్బందుల్లో ఉంది, కాబట్టి ఇప్పుడు ఏపీని హైదరాబాద్లో కలిపేస్తారా? అని మంత్రి ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సిడబ్ల్యూసి ఆమోదించిన డిజైన్ల ప్రకారమే జరుగుతోందని, ఎలాంటి ఉల్లఘనాలు లేవని మంత్రి బొత్స స్పష్టం చేశారు. ఇక ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు బాధ్యతగా మాట్లాడాలని మంత్రి పువ్వాడకు బొత్స హితవు పలికారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ