చైనా దేశాన్ని ప్రస్తుతం వణికిస్తున్న కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో విజృంభిస్తూ తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. చైనాలో ఏంతో మంది ఈ వైరస్ వలన ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అధికారికంగా పేరు పెట్టింది. కరోనా వైరస్ పేరును కోవిడ్-2019(covid-2019)గా నిర్ణయించినట్టు వెల్లడించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్ జనరల్ టెడ్రాస్ అధానోమ్ గెబ్రెయేసస్ మీడియాతో మాట్లాడుతూ, కరోనా వైరస్ కు కోవిడ్-2019 పేరును ధ్రువీకరించారు. కరోనా అనే పేరు కొన్ని వైరస్‌ల సమూహాన్ని సూచిస్తుండడంతో ప్రజల్లో గందరగోళం కలిగించకుండా కోవిడ్-2019(c- corona, v- virus, d- disease2019) అనే పేరును నిర్ణయించినట్టు తెలిపారు.
అలాగే కోవిడ్-2019 నిరోధక టీకా అందుబాటులో రావడానికి 18నెలల సమయం పట్టే అవకాశం ఉందని టెడ్రాస్ అధానోమ్ గెబ్రెయేసస్ ప్రకటించారు. అప్పటివరకు అందుబాటులో ఉన్న వనరులతోనే కోవిడ్-2019తో పోరాడాల్సి ఉంటుందని ప్రపంచదేశాలకు ఆయన సూచించారు. అత్యంత ప్రమాదకరంగా మారిన ఈ వైరస్ ను శత్రువుగా పరిగణించి ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తిని ఆరంభంలోనే ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. మరోవైపు చైనాలో కోవిడ్-2019 వలన మృతిచెందిన వారి సంఖ్య అధికారంగా 1,110 కు చేరుకుంది. ఫిబ్రవరి 11, మంగళవారం నాడు ఒక్కరోజే 94 మంది మరణించినట్టుగా అధికారులు ద్రువీకరించారు. అలాగే మరో 1,600 మంది కొత్తవారికి ఈ వైరస్ సోకడంతో, మొత్తం వైరస్ బాధితుల సంఖ్య 44 వేలకు పైగా చేరినట్టు తెలుస్తుంది.
[subscribe]