సింగరేణిలో పనిచేస్తున్న బొగ్గుగని కార్మికులకు సింగరేణి యాజమాన్యం దీపావళి పండుగ నేపథ్యంలో తీపి కబురు అందించింది. సింగరేణిలో ప్రతి సంవత్సరం దీపావళికి ముందు కార్మికులకు పీఎల్ఆర్ బోనస్ చెల్లిస్తుంటారు, ఈ పద్ధతిలోనే ఈ సంవత్సరం కూడా కార్మికులకు భారీ బోనస్ ను సింగరేణి యాజమాన్యం ప్రకటించింది. దీపావళి సందర్భంగా రూ.296 కోట్ల పీఎల్ఆర్ బోనస్ అందిస్తున్నామని, ఒక్కో కార్మికుడు గరిష్టంగా రూ.76,500 బోనస్ అందుకోనున్నారని సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ వెల్లడించారు. పీఎల్ఆర్ కింద ఈ బోనస్ మొత్తాన్ని అక్టోబర్ 21, శుక్రవారం నాడు కార్మికులకు చెల్లించబోతున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా సింగరేణి కార్మికులకు సీఎండీ ఎన్.శ్రీధర్ శుభాకాంక్షలు తెలియజేశారు.
కాగా సింగరేణి కాలరీస్ సంస్థ 2021-22 సంవత్సరానికి గాను సాధించిన లాభాల్లో 30 శాతం వాటాను(రూ.368 కోట్లు), సింగరేణి ఉద్యోగులకు దసరా కానుకగా అందిస్తూ ఇటీవలే సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో లాభాల వాటా, దీపావళీ బోనస్ కలిపి ఒక్కో కార్మికుడుకి సుమారు రూ.1.60 లక్షలు అందుతున్నాయి. ఈ నగదును కార్మికులు కుటుంబ సంక్షేమం కోసం పొదుపు చేసుకోవాలని సీఎండీ సూచించారు. కష్టపడి పనిచేసి ప్రొడక్షన్ లక్ష్యాలను సాధిస్తే ఇటువంటి బోనస్ లను కూడా పెద్ద మొత్తంలో అందుకునే అవకాశం ఉంటుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో లాభాల వాటా బోనస్‌ను కార్మికులకు అందిస్తున్నామని, ఈ అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు సింగరేణి కార్మికుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు సీఎండీ శ్రీధర్ పేర్కొన్నారు. మరోవైపు పీఎల్ఆర్ బోనస్ పై యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సింగరేణి కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY