హైదరాబాద్ రెడ్ హిల్స్ లోని ఉద్యాన శిక్షణా కేంద్రంలో ఆయిల్ పామ్ సాగు పురోగతి, నూనెగింజల సాగు, యాసంగి పంటలపై తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, సుస్థిర వ్యవసాయమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రైతుల ఆదాయం పెరగాలని, పెద్దఎత్తున ఉపాధి కల్పన జరగాలనన్నది సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని చెప్పారు. కాలానుగుణంగా అవసరమైన పంటల సాగును ప్రోత్సహించాలని, నూనెగింజల సాగు ప్రోత్సాహంలో భాగంగా ప్రధానమైన ఆయిల్ పామ్ సాగును పెంచాలని ప్రభుత్వం నిర్ణయించి ముందుకు సాగుతున్నదన్నారు. 20 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యం పెట్టుకున్నామని, దీనిమూలంగా కొన్ని వేల కోట్లు రాష్ట్ర ఆదాయం పెరగడమే కాకుండా దాని ఉప ఉత్పత్తులు, వివిధ రకాల పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి పెరుగుతుందని మంత్రి తెలిపారు.
“ఈ సంవత్సరం 1.78 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు లక్యం. అధిక వర్షాలు మరియు ఇతర అననుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా, ఇప్పటివరకు 30,849 ఎకరాలలో సాగు మొదలయింది. వచ్చే మార్చి నాటికి 1.78 లక్షల ఎకరాల లక్ష్యం చేరుకోవాలి. ఆయిల్ పామ్ సాగు ప్రోత్సాహంలో వంద శాతం ఫలితాలు సాధించే దిశగా కృషిచేయాలి. ఉద్యాన, వ్యవసాయ అధికారులు, ఆయా జిల్లాలు కేటాయించిన ఏజెన్సీలు సమన్వయంతో పనిచేయాలి. ఆయిల్ పామ్ సాగు చేసే రైతుల ప్రోత్సాహం మరియు సూక్ష్మ సేద్య పరికరాల కొరకై ప్రభుత్వం నిధులను అందుబాటులో ఉంచింది. ప్రభుత్వం అందించే సబ్సిడీని వెనువెంటనే రైతులకు అందేలా చూడాలి. జిల్లాల వారీగా ఉద్యాన, వ్యవసాయ అధికారులు సంయుక్త సమావేశాలు నిర్వహించి సాగు యోగ్యమైన భూమి, పంటల సాగు వివరాలు, ప్రోత్సహించాల్సిన పంటలపై చర్చించాలి. ప్రతి పది రోజులకు సమావేశాలు నిర్వహించి సమస్యలపై కూలంకషంగా చర్చించి ప్రణాళికలు రూపొందించుకోవాలి. ఆయిల్ పామ్ నర్సరీల నిర్వహణ నిబంధనల ప్రకారం కొనసాగుతున్నది, లేనిది పరిశీలించాలి. ఆయిల్ మొక్కలు నాటేటప్పుడు తగినన్ని ఎరువులు వేసేలా రైతులకు అవగాహన కల్పించాలి. ముఖ్యంగా సేంద్రీయ ఎరువులు వేసే విధంగా ప్రోత్సహించాలి” అని మంత్రి అధికారులకు సూచించారు.
“ప్రతి రైతు వద్ద ఒక డైరీని ఏర్పాటు చేసి ఆయిల్ పామ్ ఇతర పంటల సాగుకు సలహాలు అందించాలి. నిరంతరం పర్యవేక్షణ చేయాలి. కంపెనీలు ప్రతి వెయ్యి ఎకరాలకు ఒక సిబ్బందిని నియమించుకోవాలి. ఈ సంవత్సరం లక్ష్యం చేరుకోవడంతో పాటు, 2023-24, 2024-25 సంవత్సరాలకు కావలసిన మొక్కలను కూడా ప్రణాళికా బద్ధంగా రైతులకు సరఫరా చేయాలి. నిర్ణీత లక్ష్యం చేరుకోవడంలో ఎలాంటి సమస్యలున్నా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. అంతర పంటలు వేయించడానికి, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని రైతులకు అందేలా చూడాలి. నాలుగేళ్ల నుండి దిగుబడి మొదలై ఆదాయం వస్తుందని రైతులకు స్పష్టంగా వివరించాలి. ఆయిల్ పామ్ సాగుకు ఉత్సాహంగా ఉన్న రైతులకు వెంటనే డ్రిప్, ప్లాంట్ మెటీరియల్ అందజేయాలి. ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కల్పించేందుకు క్షేత్రస్థాయి పర్యటనలు ఏర్పాటు చేయాలి. యాసంగిలో పత్తి సాగు వైపు రైతులను నడిపించాలి. క్లస్టర్ల వారీగా ఉత్సాహంగా ఉన్న రైతులను గుర్తించాలి, అవగాహన సదస్సులు నిర్వహించాలి. యాసంగిలో శనగలు, వేరుశనగ, మొక్కజొన్న, నువ్వులు, ఆవాలు, ఇతర అపరాలు, ఆముదం సాగును ప్రోత్సహించాలి” అని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఆయిల్ ఫెడ్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, ఉద్యానశాఖ డైరెక్టర్ హన్మంతరావు, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమీషనర్ హన్మంతు, ఆయిల్ ఫెడ్ ఎండీ సురేందర్, వ్యవసాయ అదనపు సంచాలకులు విజయ్ కుమార్, అన్ని జిల్లాల ఉద్యాన, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY