తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఐదవ దశ ‘ప్రజా సంగ్రామ యాత్ర’కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కొన్ని కీలక షరతులు విధించింది. భైంసా పట్టణానికి 3 కి.మీ దూరంలో సభ నిర్వహించుకోవాలని, అలాగే పాదయాత్ర సిటీలోకి వెళ్లకుండా కొనసాగించాలని సూచనలు చేసింది. దీనికి బీజేపీ తరపు లాయర్లు అంగీకారం తెలుపడంతో కోర్టు అనుమతి మంజూరు చేసింది. కాగా నిన్న ఆయన పాదయాత్రకు నిర్మల్ జిల్లా పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు జిల్లా ఎస్పీ పాదయాత్రతో పాటు భైంసా పట్టణంలో జరిగే బహిరంగ సభకు అనుమతి లేదని ఆదివారం స్పష్టం చేశారు. భైంసా సున్నితమైన ప్రాంతం అని, పాదయాత్ర సందర్భంగా ఏవైనా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉందని పేర్కొంటూ అనుమతి నిరాకరించారు.
అయితే ఎట్టి పరిస్థితుల్లో పాదయాత్ర జరిపి తీరుతానని ప్రకటించిన బండి సంజయ్ భైంసాకు బయలుదేరగా జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ శివారు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆయనను కరీంనగర్ లోని స్వగృహంలో గృహనిర్బంధంలో ఉంచారు. ఇంటినుంచి సంజయ్ బయటకు అడుగు పెడితే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ పాదయాత్రపై బీజేపీ హైకోర్టుని ఆశ్రయించింది. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా.. విచారణకు స్వీకరించిన కోర్టు పాదయాత్రకు అనుమతిస్తూ ఆదేశాలిచ్చింది. దీంతో ఈరోజు మధ్యాహ్నం భైంసా సమీపంలోని వై జంక్షన్ వద్ద జరుగనున్న సభకు భారీగా తరలిరావాలని రాష్ట్ర బీజేపీ నాయకత్వం శ్రేణులకు పిలుపునిచ్చింది. నేటినుంచి డిసెంబర్ 15వ తేదీ వరకూ బండి సంజయ్ ఐదవ విడత పాదయాత్ర కొనసాగనున్నట్లు బీజేపీ ఇప్పటికే ప్రకటించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE