అమెజాన్ అనగానే.. ప్రపంచంలోనే అతి పెద్ద, అత్యంత దట్టమైన అటవీ ప్రాంతమే అందరికీ గుర్తుకు వస్తుంది. దక్షిణ అమెరికాలో తొమ్మిది దేశాలకు విస్తరించిన అడవులు.. అమెజాన్ అడవులు. అంతెందుకు ఈ భూమండలానికి ఊపిరితిత్తులుగా అమెజాన్ అడవులను అభివర్ణిస్తుంటారంటేనే వీటి గొప్పతనాన్ని అర్థం చేసుకోవచ్చు. అమెజాన్ అడవుల గురించి చెప్పాలంటే ప్రతీదీ ఒక అద్భుతమే . లక్షల చదరపు కిలోమీటర్ల వరకూ విస్తరించిన చిత్తడి నేల గల ప్రదేశం అమెజాన్‌లో ఉంటుంది. అమెజాన్‌లో ఏడాది పొడవునా వర్షం కురుస్తుండటమే అక్కడి మరో ప్రత్యేకత.
ఎక్కువగా 60 శాతం వరకూ అమెజాన్ అడవులు బ్రెజిల్లో విస్తరించి ఉన్నాయి. పెరూలో 13 శాతం, కొలంబియాలో 10 శాతం వరకూ విస్తరించాయి. ఫ్రెంచ్ గయానా,గయానా,బొలీవియా,ఈక్వెడార్, సురినమె,వెనిజులాలో కూడా అమెజాన్ అడవుల జాడలు ఉన్నాయి.ఈ అమెజాన్ అడవుడల నుంచే 20 నుంచి 30 శాతం వరకూ ఆక్సిజన్ అందుతుందని ఇప్పటికే సైంటిస్టుల అంచనా వేశారు.
సాధారణంగా అమెజాన్ అడవుల్లో ఏడాది పొడవునా కూడా అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. ఇక్కడి గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీలు నమోదు కాగా.. కనిష్ట ఉష్ణోగ్రత 20 నుంచి 25 డిగ్రీల వరకు నమోదవుతూ ఉంటుంది. అలాంటి అమెజాన్ అడవుల్లో ఈ మధ్య నమోదవుతున్న ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. కొద్దిరోజులుగా అమెజాన్‌లో నమోదవుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రత 39 డిగ్రీల పైమాటే ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అంటే 100 నుంచి 102 ఫారెన్‌హీట్‌గా అమెజాన్ అడవుల టెంపరేచర్ ఉంటోంది.
అయితే ఈ ఉష్ణోగ్రతలే ఇప్పుడు అక్కడి అనేక జీవజాలానికి మరణశాసనంలా మారుతున్నాయి. ముఖ్యంగా డాల్ఫిన్లు.. పెద్ద ఎత్తున మృత్యువాత పడటం పర్యావరణవేత్తలను ఆందోళనలో పడేస్తుంది. గడిచిన వారం రోజుల్లోనే వందకు పైగా డాల్ఫిన్లు మరణించడం కలకలం రేపుతోంది. అప్పర్ అమెజాన్ నదీ తీరంలో ఉన్న లేక్ టెఫెలో..చాలా డాల్ఫిన్ల మృతదేహాలు కొట్టుకు వస్తుండటంతో పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే అంత హఠాత్తుగా డాల్ఫిన్ల మృత్యువాత పడటంతో బ్రెజిల్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అంతేకాదు దీనిపై విచారణ కోసం ప్రత్యేకంగా మమిరువా ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలతో కూడిన ఓ బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది.చివరకు ఈ బృందం.. వందకు పైగా డాల్ఫిన్ల మృత్యువాత పడటానికి వాతావరణ మార్పులే కారణమని ప్రాథమికంగా నిర్ధారించింది. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈ స్ఠాయిలో ఉష్ణోగ్రతలు రికార్డు నమోదు కావడం అటు కరవుకు కూడా దారి తీసే ప్రమాదం ఉందని ఈ బృందం హెచ్చరించింది.
ప్రస్తుతం మిగిలి ఉన్న డాల్ఫిన్లను సంరక్షించడానికి బ్రెజిల్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం వల్ల అమెజాన్ నదీ తీరం చాలా వరకు ఎండి పోయిందని మమిరువా ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలతో కూడిన సైంటిస్టుల బృందం ధృవీకరించింది. అంతేకాదు అమెజాన్ అడవులకు మాత్రమే పరిమితమైన కొన్ని అరుదైన మొక్కలు కూడా ఎండిపోతున్నట్లు తెలిపింది. ఇలాంటి పరిస్థితి మున్ముందు కూడా కొనసాగితే మరింత నష్టాన్ని చవి చూడాల్సి వస్తుందని మమిరువా ఇన్స్టిట్యూట్ బృందం చెబుతోంది. మరోవైపు ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల.. బ్రెజిల్‌లోని అమెజాన్ స్టేట్‌లో ఇప్పటికే కరవు ఛాయలు ఏర్పడినట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. అమెజాన్ స్టేట్‌లో ఉన్న 59 మున్సిపాలిటీల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్నట్లు ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE