తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ రాకముందే అన్ని పార్టీల కంటే ముందు అభ్యర్థుల జాబితాను ఎప్పుడో రిలీజ్ చేసి రిలాక్సయిపోయిన గులాబీ బాస్.. ఇప్పుడు అసలు పనికి శ్రీకారం చుడుతున్నారు.మిగిలిన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తుల మీద కసరత్తులు చేస్తుంటే.. ఈ పని ఎప్పుడో చేసేసిన సీఎం కేసీఆర్.. తన దృష్టంతా ఎన్నికల ప్రచారం, రాబోయే ఎన్నికల్లో మూడోసారి చక్రం తిప్పడంపైనే కేంద్రీకరించారు.
ముఖ్యంగా యూత్‌ను ఆకట్టుకుంటే చాలు.. సగం గెలుపు సాధించినట్లేనన్న ఫార్ములాను ఫాలో అవుతున్నారు. దీనిలో భాగంగానే యూత్ ఎక్కువగా గడిపే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను ఎంచుకుని.. వాళ్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. నిజానికి యువతతో పోటీపడుతూ అన్ని వయసుల వాళ్లు ఇప్పుడు సోషల్ మీడియాలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. సరిగ్గా ఈ పాయింట్‌నే పట్టుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ..యూత్ ను, వివిధ వర్గాల వారిని ఆకట్టుకోవడానికి సోషల్ మీడియాను, డిజిటల్ మీడియాను విపరీతంగా వాడుకోవాలని డిసైడ్ అయిపోయారు.
రకరకాల కార్టూన్లతో, వీడియోలతో ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేస్తోంది బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్. ప్రజా సంక్షేమం కోసం తాము ఇప్పుడు చేస్తున్న మంచి పనులను లబ్ధిదారులతోనే చెప్పించి, మళ్లీ కేసీఆర్‌ను గెలిపిద్దాం అని ప్రమోషన్ మొదలుపెట్టింది. సోషల్ మీడియాలో ఆసక్తికరమైన వీడియోలను తయారు చేసి.. కేసీఆర్ వన్స్ అగైన్ అనే స్లోగన్‌తో.. ఈ సారి కూడా కారు గుర్తుకే ఓటేసి గెలిపించాలంటూ నెట్టింట్లో నయా ప్రచారంతో హోరెత్తిస్తోంది.
పేదవాళ్లు, రైతన్నలు, మహిళలతో పాటు తెలంగాణ వాసులకు తాము మంచి పథకాలను ప్రవేశపెడితే అది కాంగ్రెస్ పార్టీ బంగాళాఖాతంలో సమాధి చేయడానికి ప్రయత్నిస్తుందనే ప్రధాన ఆరోపణలతో కాంగ్రెస్ పార్టీపై బలమైన కార్టూన్లు కూడా వదులుతోంది. అందుకే కాంగ్రెస్ పార్టీనే బంగాళాఖాతంలో కలపడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారనే కార్టూన్లను ప్రజల్లోకి తీసుకువెళ్తుంది. అంతేకాదు..అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా వ్యతిరేక విధానాల కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిద్దాం.. కేసీఆర్ సర్కార్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగిద్దామంటూ కార్టూన్ల ద్వారానే కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తోంది.
తెలంగాణలో ఒకప్పటికీ, ఇప్పటికీ జరిగిన అభివృద్ధిలో తేడాలను చూపించే ఇంట్రెస్టింగ్ వీడియోలను పోస్ట్ చేస్తుంది. రైతు సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా కృషి చేస్తుందో వీడియోల ద్వారానే వివరిస్తూ..రైతుల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. తెలంగాణలో సంక్షేమ మంత్రం.. హైదరాబాద్‌లో జరిగిన డెవలప్మెంట్‌ను ప్రజాక్షేత్రంలోకి తీసుకు వెళ్లడానికి..ఓటర్లను ఆకట్టుకునే ఏ చిన్ని ప్రయత్నాన్ని కూడా బీఆర్ఎస్ వదులుకోవడం లేదు.ముఖ్యంగా టార్గెట్ రేవంత్ రెడ్డిగా సోషల్ మీడియాలో ప్రచారాన్ని ఉధృతం చేస్తోంది.