ఎన్నికలు జరిగిన ప్రతీ సమయంలోనూ అందరి చూపూ గజ్వేల్ నియోజకవర్గం వైపే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తాడో.. రాష్ట్రంలో అదే పార్టీ జెండా ఎగురుతుంది. ఇలా ఒక్కసారో, రెండు సార్లో కాదు.. 1967లో జరిగిన ఎన్నికలు జరిగినప్పటి నుంచీ 2018 ఎన్నికల వరకూ అదే జరిగింది.
అవును.. ఇది నిజం ఏ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే.. ఏ గుర్తుకు ఓటేస్తే రాష్ట్రానికి, ప్రజలకు మంచిదో గుర్తించడంలో గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు చాలా చైతన్యవంతులు అని రాజకీయ విశ్లేషకులు సైతం అంటూ ఉంటారు. అలా గజ్వేల్ ప్రజలు ఏ పార్టీనైతే తమ నియోజకవర్గంలో గెలిపిస్తారో అదే పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం అనేది కొన్నేళ్లుగా సెంటిమెంట్‌గా కొనసాగుతూ వస్తోంది.
1967 నుంచి ఈ సెంటిమెంట్ కొనసాగుతూ వస్తుంది. 1967వ సంవత్సరం, 1972 వ సంవత్సరం, 1978 వ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో గజ్వేల్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన జీ సైదయ్య విజయం సాధించారు.ఈ మూడు ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
ఆ తర్వాత 1983లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎ.సాయిలు, 1985వ సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో బి. సంజీవరావు ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఈ రెండు ఎన్నికల్లోనూ తెలుగు దేశం పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది.
అయితే 1989లో కాంగ్రెస్ అభ్యర్థి గీతారెడ్డి గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలవగా, ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 1994 సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో, 1999 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో..తెలుగు దేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా.. రాష్ట్రంలోనూ టీడీపీనే గెలిచింది. 2004లో జరిగిన ఎన్నికల్లో, 2009లో జరిగిన ఎన్నికల్లో గజ్వేల్ ఎమ్మెల్యేలుగా కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. ఆ రెండు సార్లు కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.
అంతేకాదు 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో, 2018లో జరిగిన ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గం నుంచి కేసీఆర్ పోటీ చేసి ఘన విజయాన్ని సాధించారు. అలా ఈ రెండు ఎన్నికల్లోనూ రాష్ట్రంలో కూడా బీఆర్‌ఎస్ గెలిచి అధికారంలోకి వచ్చింది. గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలిచిన కేసీఆర్..రెండు సార్లు ముఖ్యమంత్రి కూడా అయ్యారు.
ఇప్పుడ గజ్వేల్ గడ్డపై మూడోసారి పోటీ చేస్తూ హ్యాట్రిక్ కొట్టేందుకు సీఎం కేసీఆర్ తన అభివృద్ధే తన గెలుపు మంత్రం అన్న ధీమాతో ఉండగా, మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీసీ నినాదాన్ని నమ్ముకుంటూ బరిలోకి దిగారు. మరి గజ్వేల్ ఓటర్లు ఎవరివైపు మొగ్గు చూపుతారో.. ఈ సారీ అదే సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందో లేదో తెలియాలంటే.. డిసెంబర్ 3 వరకూ వెయిట్ చేయాల్సిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE