తెలంగాణ‌లో ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ మొద‌లైందా?

Operation Akarsh, Telangana, Has Operation Akarsh Started in Telangana, Congress, BRS, Telangana Politics, Telangana CM A Revanth Reddy, Telangana, op Akarsh, BRS launches Operation Aakarsh, Congress, Telangana Latest News, Telangana Politics, Mango News Telugu, Mango News
Operation akarsh, Telangana, Congress, BRS, Telangana Politics

తెలంగాణ‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచే.. బీఆర్‌ఎస్ నేత‌లు కొంద‌రు ప్ర‌భుత్వం ఎన్నాళ్లో ఉండ‌దంటూనే ఉన్నారు. చోటా మోటా నాయ‌కులే కాదు.. పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్ కూడా త్వ‌ర‌లోనే కేసీఆర్ ను ముఖ్య‌మంత్రిగా చూద్దాం అంటూ పార్టీ స‌మావేశాల్లో చెబుతున్నారు. ఇప్పుడు ఇదే అంశం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. మెజారిటీ సీట్ల‌తో సొంతంగా అధికారంలోకి వ‌చ్చి.. ఆరు గ్యారెంటీల అమ‌లు కోసం చురుగ్గా ప్ర‌భుత్వం ప‌ని చేస్తుంటే.. బీఆర్‌ఎస్ స్టేట్‌మెంట్లు ప్ర‌జ‌ల‌ను గంద‌ర‌గోళానికి గురి చేస్తున్నాయి. ఇవ‌న్నీ గ‌మ‌నిస్తున్న కాంగ్రెస్ ముందు జాగ్ర‌త్త‌గా ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ కు సిద్ద‌మైందా అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు ఒక్కరొక్కరుగా, జట్టుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలుస్తుండటంతో వారు కాంగ్రెస్‌లో చేరతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

అధికారంలోకి వ‌చ్చిన పార్టీల్లో చేర‌డం కొత్తేం కాదు.. ఆప‌రేషన్ ఆక‌ర్ష్ లు ప్ర‌తిసారీ కొన‌సాగుతున్న ఒర‌వ‌డే. ఆప‌రేష్ లాంటి ఊహాగానాలు నిజమైన చరిత్ర గతంలో ఉంది. కాంగ్రెస్, టీడీపీల నుంచి పలువురు బీఆర్‌ఎస్‌లో చేరడానికి కొద్దిరోజుల ముందు‘మర్యాదపూర్వకంగానే’ సీఎం కేసీఆర్‌ను కలిశామని చెప్పారు. ఇప్పుడు అదే పరిస్థితి పునరావృతమయ్యేందుకు లోక్‌సభ ఎన్నికలు మాత్రమే ఆటంకంగా ఉన్నాయ‌ని ప‌లువురు ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా అని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని, ఆపార్టీనేతలైన తండ్రీకొడుకులు కేసీఆర్, కేటీఆర్‌లను అనేందుకు బోలెడన్ని దృష్టాంతాలు కనిపిస్తాయి. పార్టీలు మార్చే గేమ్‌ను తానైతే ప్రారంభించనని, అవతలి వారు ప్రారంభించినప్పుడు తాము సైతం రేసులో ఉండక తప్పదని రేవంత్‌రెడ్డి ఇదివరకే ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

అనంత‌రం ఒకరి తర్వాత ఒకరు అన్నట్లుగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డిని కలుస్తున్నారు. మొన్న సునీతా లక్ష్మారెడ్డి (నర్సాపూర్‌), కొత్త ప్రభాకర్‌రెడ్డి (దుబ్బాక), గూడెం మహిపాల్‌రెడ్డి (పటాన్‌చెరు), మాణిక్‌రావు (జహీరాబాద్‌)లు కలిశారు. ఆ త‌ర్వాత నిన్న రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాశ్‌ గౌడ్‌ కలిశారు.  ఉభయులకు మధ్యన రేవంత్‌రెడ్డిని కలిసిన మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే, మాజీ మేయర్‌ తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు బహిరంగంగానే ప్రకటించారు. బీఆర్‌ఎస్‌ నుంచి తనకు మహేశ్వరం టిక్కెట్‌ రాకపోవడంతో అసెంబ్లీ ఎన్నికలకు ముందే పార్టీ మారేందుకు ఆయన సిద్ధమైనా ఎందుకనోగానీ అప్పట్లో వెనకడుగు వేశారు. ఇప్పుడు బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన వారు సైతం రేవంత్‌రెడ్డిని కలవడమే రాజకీయంగా చర్చనీయాంశమైంది.

తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం కలిశామని, సమస్యలు పరిష్కరించాల్సిందిగా కోరామని, మర్యాదపూర్వకంగా కలిశామని, రేవంత్‌ రెడ్డి రాష్ట్రానికే సీఎం అయినందున కలిస్తే తప్పేముందని, అంతమాత్రాన పార్టీ మారతామా ? అని ఎవరికి వారుగా తాము రేవంత్‌ను కలవడాన్ని సమర్థించుకున్నారు. కానీ, ఇప్పటికే సీఎం రేవంత్‌పై  తీవ్ర కసితో రగిలిపోతున్న కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావుల అనుమతితోనే వారు సీఎంను కలిశారా? వారికి చెప్పకుండా కలిశారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదన్నట్లు  అధిష్ఠానం ,అగ్రనేతల అనుమతి లేకుండా కలిసేంత స్వేచ్ఛా స్వాతంత్య్రాలు బీఆర్‌ఎస్‌లో ఉన్నాయని ఎవరూ అనుకోవడం లేరు.

ఈ నేప‌థ్యంలో అధిష్ఠానానికి చెప్పకుండా వెళ్లారంటే జరిగేదేమిటో ఎవరైనా అర్థం చేసుకోగలరు.  ఉన్నవారిని కాపాడుకోవడమే పరీక్షగా మారిన తరుణంలో  అనుమతి లేనిదే వెళ్తారా? అని ఆగ్రహించే పరిస్థితి సైతం అగ్రనేతల కిప్పుడు లేదు. ఒకవేళ అదే జరిగితే వారికి అడ్డొస్తున్న మొహమాటం.. అడ్డుగోడలు తొలగినట్లేనని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. కాగల కార్యం గంధర్వులే తీర్చినట్లు వెంటనే కాంగ్రెస్‌లో కలిసిపోగలరని అభిప్రాయపడుతున్నారు. ఎవ‌రు ఏ పార్టీలోకి వెళ్తార‌నేది బ‌హుశా లోక్ స‌భ ఎన్నిక‌ల త‌ర్వాత తేలిపోనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ