ప‌రిష్కార‌మార్గాలు చూపాలంటున్న మేధావులు

TSRTC, Free Bus, Free bus for womens, Telangana, CM Revanth reddy
TSRTC, Free Bus, Free bus for womens, Telangana, CM Revanth reddy

నిద్ర లేచింది మహిళా లోకం.. దద్దరిల్లింది పురుష ప్రపంచం వంటి  సినీగీతాలు గుర్తుకొస్తున్నాయి తెలంగాణ ఆర్టీసీ బ‌స్సుల్లో చోటుచేసుకుంటున్న ఘ‌ట‌న‌లు చూస్తుంటే. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు మేలు చేయాలని, ఇచ్చిన హామీలను త్వరితంగా అమలుచేయాలనీ మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించింది. ఎదురవుతున్న అనుభవాలతో సమస్యలు పరిష్కరించుకోవచ్చు కానీ అంతవరకు కూడా ఓపిక లేని ప్రజలు, ప్రతిపక్షం తీరుతో  వ్యతిరేక ఫలితాలొచ్చి అసలుకే ప్రమాదం వచ్చే పరిస్థితి పొంచి ఉంది.

మొన్న ఒక బస్సులో ఏకంగా బస్సు కండక్టర్‌పైనే ప్రయాణికురాలి దాడి చేసింది. అంతేకాదు.. కాలితో తన్నుతూ, ఇష్టాను సారం తిట్ల దండ‌కం అందుకుంది. నిన్న ఒక ఆటోవాలా ఉచిత బస్సుతో తనకు ఉపాధి పోయిందంటూ  ప్రజాభవన్‌ వద్ద ఆటోను తగులబెట్టాడు. అంతకుముందు బీడీలు చుడుతూ బస్సులో మహిళ ప్రయాణం చేసిన ఘ‌ట‌నా ఉంది. ఇంకో వైపు లేడీస్‌ స్పెషల్‌ బదులు మేల్‌ స్పెషల్‌ బస్సుల ప్రయాణం మొద‌లుపెట్టాల్సిన ఆవ‌శ్య‌క‌త‌పై ప్ర‌చారం జ‌రుగుతోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభమైనప్పటి నుంచే ఇక నుంచి ‘పురుషులకు  కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం’ అని రాయాల్సి ఉంటుందేమోనని సాధారణ ప్రజాబాహుళ్యంలో జోకులు పేలాయి. సోషల్‌మీడియాలో మీమ్స్‌ కనిపించాయి.  కానీ, అవే ఇప్పుడు నిజాలవుతున్నాయి. ఈ పరిస్థితికి  అటు ప్రభుత్వం,ఇటు మహిళలు కూడా కారణమని చెప్పక తప్పదు.

తమది ప్రజాప్రభుత్వమని చెప్పుకునే ఆరాటంలో త్వరితంగా పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం ఎదురయ్యే ఇబ్బందుల్ని ఊహించలేకపోయింది. క్రమేపీ తగ్గుతాయని భావించి ఉండవచ్చు. కానీ రోజురోజుకూ సమస్యలు పెరుగుతున్నాయి. అందుకు కారణం ప్రజలని చెప్పక తప్పదు. కాలిన డకన వెళ్లగలిగిన దూరాలకు సైతం బస్సులెక్కుతున్నారు. అంతటితో అయిపోలేదు. బస్సు ఆగితే చాలు వారికోసం ఉన్న ముందు ఎంట్రన్స్‌ నుంచే కాక పురుషులెక్కే వెనుక ఎంట్రన్స్‌ వద్ద సైతం కాలుపెట్టే చోటు లేకుండా గుమి కూడుతున్నారు. బస్సులోపల సైతం వెనుకనుంచి ఎక్కిన వారు వెనుక సీట్లలో తిష్టవేస్తున్నారు. దీంతో మహిళలు, పురుషుల మధ్య తరచూ వాగ్వాదాలు జరుగుతున్నాయి. మరోవైపు, ఉచిత ప్రయాణమని బస్సుల్ని ఆపాల్సిన చోట ఆపకుండానే వెళ్తున్నాయని, దిగాల్సిన చోట కూడా దిగకముందే  ఆపకుండా వెళ్లిపోతున్నారని, మీ ఉచితమేమో కానీ మా ఆత్మాభిమానాన్ని  చంపుకోలేమంటూ బాధపడుతున్న మహిళలు ఉన్నారు.

సహజంగానే ఆటోల్లో ఎక్కువగా వెళ్లేది మహిళలే. ఉచిత ప్రయాణంతో ఎంత సేపైనా వేచి ఉంటున్నారు కానీ  అత్యవసరమైతే, లగేజీ ఉంటే తప్ప ఆటోలు ఎక్కడం లేరు.ఇది ఆటోవాలాల ఉపాధిపై ప్రభావం చూపుతోంది. ఇందుకు తగిన ప్రత్యామ్నాయాన్ని ప్రభుత్వం చూపాల్సి ఉంది. అంతేకాదు.. ఉచితంతో మహిళల ప్రయాణాలు నాలుగైదు రెట్లు పెరిగిపోయాయి. అందుకనుగుణంగా బస్సులూ పెరగాలి. రద్దీ తగ్గేందుకు కొన్ని పరిష్కార మార్గాలూ అవసరమని మేధావులు చెబుతున్నారు. మన సమాజంలో ఫ్రీ అంటే ఫినాయిలైనా వదలరనే నానుడి ఉంది. అందుకే పూర్తి ఫ్రీ బదులు కనీసం ఒక్క రూపాయి అయినా సరే ధర ఉండాలంటున్నారు. ఇందుకు రామకృష్ణ మఠం  వారి రూ.5 భోజనాన్ని ఉదహరిస్తున్నారు. వాస్తవానికి అది ఉచిత భోజనంతో సమానమే కానీ, ధర పెడితే వృథా చేయరు. ఇదీ అంతే. లేదా బస్సుపాసుల్ని రెన్యువల్‌ చేయించుకున్నట్లుగా నెలకో,మూడునెలలకో వాలిడిటీ డేట్‌తో రెన్యువల్‌ చేసే విధానాన్ని అమలు  చేయాలి. తద్వారా నిజంగా అవసరమైన వారు మాత్రమే కౌంటర్ల దాకా వెళ్లి రెన్యువల్‌ చేయించుకుంటారు. ఇలా స్వల్ప చర్యలతో అదనపు రద్దీని, అనవసర ప్రయాణాల్ని నివారించే అవకాశముంది. ప్రభుత్వం ఈ దిశగా కూడా ఆలోచిస్తే మేలేమో!

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY