2014, 2019 ఎన్నికల్లో అన్న జగన్ గెలుపు కోసం చెల్లెలు షర్మిలా ఎంతో కష్టపడ్డారు. ఆయన జైల్లో ఉన్నప్పుడు ఊరురా తిరిగారు. ఆ తర్వాత 2019 ఎన్నికలకు ముందు సైతం చంద్రబాబుపై పదునైన విమర్శలు చేస్తూ ప్రచారం చేశారు. సీన్ కట్ చేస్తే 2024.. ఇప్పుడు అన్న జగన్‌పై షర్మిల తిరగబడింది. ముందుగా తెలంగాణలో కొత్త పార్టీ పెట్టి ఆ తర్వాత కాంగ్రెస్‌తో తన పార్టీని విలీనం చేసిన షర్మిల తక్కువ సమయంలోనే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా బాధత్యలు చెప్పారు. తాజాగా కడప నుంచి ఎంపీగా పోటి చేసేందుకు సిద్ధమయ్యారు. కడప నియోజకవర్గం నుంచి ఆమె బంధువు, సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై పోటీ చేయనున్నారు.
కంచుకోట కడప:
దాదాపు నాలుగు దశాబ్దాలుగా వైఎస్‌ఆర్ కుటుంబానికి పుట్టినిల్లుగా ఉన్న కడప నుంచి షర్మిల ఎన్నికల బరిలోకి దిగనుండడం ఆసక్తిని రేపుతోంది. కాంగ్రెస్ పార్టీ మంగళవారం ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదుగురు లోక్ సభ అభ్యర్థుల జాబితాలో షర్మిల పేరు ఉంది. మామ, మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో అవినాష్‌రెడ్డిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో దాయాదుల మధ్య పోటాపోటీ నెలకొంది. ఐదేళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి షర్మిల నిబద్ధతను స్వాగతించారు. తన మద్దతుకు షర్మిలకు సునీతారెడ్డి కృతజ్ఞతలు తెలుపగా, జగన్‌కి తన తండ్రి హంతకులను తెలుసునని, అయినా వారిని కాపాడుతూనే ఉన్నారని ఆమె తన వాదనను మరోసారి కుండబద్దలు కొట్టారు.
కడపలో ఎన్నికల్లో పోటీ చేయాలనేది తన తండ్రి కోరిక కాబట్టి షర్మిల అభ్యర్థిత్వాన్ని స్వాగతిస్తున్నట్లు సునీతారెడ్డి తెలిపారు. హంతకులకు, వారిని కాపాడుతున్న జగన్ పార్టీకి ఓటు వేయవద్దని ఇప్పటికే ప్రజలను కోరారు. దర్యాప్తు సంస్థపై ఒత్తిడి కారణంగానే తన తండ్రి హత్య కేసులో సీబీఐ విచారణ నిలిచిపోయిందని సునీతారెడ్డి ఆరోపిస్తున్నారు. గతేడాది ఏప్రిల్‌లో వివేకానందరెడ్డి బంధువు, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. వివేకానంద రెడ్డిని అంతమొందించేందుకు అవినాష్, భాస్కర్ రెడ్డి ఇద్దరూ కుట్ర పన్నారని సీబీఐ ఆరోపించింది. అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు 2023 మే 31న మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అవినాష్ రెడ్డి 2014, 2019లో కడప నుంచి వైఎస్‌ఆర్‌సీపీ టికెట్‌పై గెలిచారు. ఆయనపై హత్యా ఆరోపణలు వచ్చినా జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ అవినాష్‌నే రంగంలోకి దించారు.
1989లో వైఎస్‌ఆర్ తొలిసారిగా ఇక్కడి నుంచి ఎన్నికైనప్పటి నుంచి ఆయన కుటుంబం కడప లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తోంది. 1991, 1996, 1998లో ఈ పదవిలో కొనసాగారు.1999లో కాంగ్రెస్‌లో చేరినప్పుడు తమ్ముడు వివేకానందరెడ్డి కడప నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. 2004లో కూడా వివేకానందరెడ్డి ఈ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. 2009లో వైఎస్‌ఆర్ తనయుడు, ప్రస్తుత ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కడప లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. తన తండ్రి , అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ మరణం తరువాత అధికార కాంగ్రెస్ నుంచి విడిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. 2011 లో అపూర్వమైన మెజారిటీని సాధించి కడప స్థానాన్ని నిలబెట్టుకుంది వైసీపీ.
2014లో కడప లోక్‌సభ సీటును తన బంధువు అవినాష్‌రెడ్డికి వదిలిపెట్టి జగన్ తన కుటుంబ కంచుకోట అయిన పులివుందులపై దృష్టి సారించారు. ఇక అప్పటినుంచి రెండు సార్లు కూడా అవినాష్ పోటి చేశారు. ఇప్పుడు షర్మిల ఆయనపై తాడోపెడో తేల్చుకోనున్నారు. అయితే నిజానికి షర్మిలా ఎప్పుడో హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యారు. కడపకు అప్పుడుప్పుడు మాత్రమే వస్తూ ఉండేవారు. మరి చూడాలి కడప ఓటర్లు షర్మిలను గెలిపిస్తారో లేదో అవినాష్‌కే మళ్లీ పట్టం కడతారో.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY