ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ నేతలంతా ప్రచార పర్వంలో బిజీ అయిపోయారు . ఒక విధంగా చెప్పాలంటే ప్రచారంలో సీఎం జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కంటే కూడా టీడీపీ అధినేత చంద్రబాబు తన ప్రచారాలతో దూసుకుపోతున్నారు. వయసును కూడా లెక్క చేయకుండా..భానుడి భగభగలతో అంతా వణికిపోతున్నా అవేమీ పట్టించుకోకుండా రోజుకు మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు.
టీడీపీని కచ్చితంగా ఈ సారి అధికారంలోకి తీసుకురావాలని.. వైఎస్పార్సీపీని గద్దె దించాలని లక్ష్యంగా పెట్టుకున్న చంద్రబాబు..దానికి అనుగుణంగా తన సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. ఇప్పుడు కానీ నిలదొక్కుకోలేకపోతే ఇక ఏపీలో టీడీపీ కోలుకోవడం కష్టమన్న సంగతి బాగా తెలిసిన చంద్రబాబు ఇష్టం లేకపోయినా కూటమి మద్దతు కూడగట్టుకుని ముందుకు సాగుతున్నారు.
అయితే ఇటు వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాత్రం.. తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయన్న ధీమాలో ఉంది.అయితే ఇటు చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే ఈ ప్రభుత్వంలో అమలవుతున్న పథకాలను కొనసాగిస్తూనే ఇంతకు మించి సంక్షేమ పథకాలను అందరికీ అందిస్తామని ప్రతీ సభలోను ప్రకటిస్తున్నారు.
ముఖ్యంగా పింఛన్ల పంపిణీని చంద్రబాబు అడ్డుకున్నారంటూ వైసీపీ చేస్తున్న ప్రచారాలకు అడ్డుకట్ట వేస్తున్నారు. వైసీపీ నేతల మాటలతో వాలంటీర్ల ద్వారా పింఛన్లను ఇంటి వద్దే తీసుకోకుండా.. నిమ్మగడ్డ రమేష్ సాయంతో చంద్రబాబు అడ్డుకున్నారంటూ టీడీపీపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అందుకే వీటిని కవర్ చేసేలా చంద్రబాబు రెండు ముఖ్యమైన హామీలు ఇస్తున్నారు.
ఈ మూడు నెలల పెన్షన్ చెల్లించడానికి జగన్ ప్రభుత్వం ఇబ్బంది పెడితే.. తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రాగానే అంతా కలిపి ఆ ఫింఛన్ ఒకే మొత్తంగా ఇస్తామని చంద్రబాబు చెబుతున్నారు.నెలకు మూడు వేలు కాకుండా.. నెలకు రూ.4వేల చొప్పున అంతా కలిపి ఒకేసారి ఇస్తామని చెబుతూ వస్తున్నారు. జగన్ గతంలో ఇచ్చిన హామీలా…పెంచుకుంటూ పోతాం అనకుండా ..పింఛన్ ఒకేసారి పెంచుతామని చెప్పడంతో వైసీపీ నేతలు కూడా షాక్ అవుతున్నారు.
మరోవైపు వాలంటీర్ వ్యవస్థపై ఏపీ వ్యాప్తంగా పెద్ద చర్చ సాగుతుండటంతో..ఇది ఎన్నికల్లో ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని భావించిన చంద్రబాబు వాలంటీర్ల గౌరవ వేతనాన్ని తాము డబుల్ చేస్తామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నెలకు రూ.10వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు ఇంతగా సేవ చేసే వాలంటీర్లకు తామెప్పుడూ అండగా ఉంటామని..వారిని విధుల నుంచి తొలగించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.ఈ రెండు హామీలతో ఇప్పటి వరకూ ఉన్న రాజకీయ సమీకరణాలను చంద్రబాబు మార్చేసారన్న వాదన వినిపిస్తోంది. మరి ఇవి ఓట్లుగా మారతాయో లేదో చూడాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE