
కూటమి గెలుస్తాందా, వైసీపీ ఓడుతుందా.. అనేది పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మొత్తం మీద జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేక ఆకర్షణగా మారారు. అనూహ్య నిర్ణయాలతో రాష్ట్ర ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చేశారు. వై నాట్ 175 అనే నినాదంతో ఉత్సాహంగా కదనం మొదలుపెట్టిన అధికార పార్టీలో వణుకు పుట్టించారు. నిస్తేజంగా ఉన్న టీడీపీలో జోష్ పెంచారు. ఈసారి ఎలాగైనా అసెంబ్లీ లో జనసేన ప్రాతినిధ్యం ఉండాలని వ్యూహం రచించారు. పవన్ రాజకీయాలతో 175 సీట్ల సంగతి తర్వాత.. వైసీపీ కి గెలుపుపై సందేహాలు మొదలయ్యేలా చేశారు. ఈసారి గట్టిగానే పోరాడాలనే ఆలోచనను వైసీపీలో రేకెత్తించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ సభలో మాట్లాడినా తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో సరిసమానంగా పవన్‌పై కూడా ఫోకస్ పెట్టాల్సి వచ్చిందంటే ఆయన ప్రభావం చెప్పకనే తెలుస్తోంది.
రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ కల్యాణ్.. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి, సినిమాలలో తాను సంపాదించిన డబ్బును రాజకీయాలలో ఖర్చు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం పదేళ్లుగా పోరాటం చేస్తున్నారు. పార్టీతో పాటు, తన గెలుపు ఈ ఎన్నికల్లో జనసేనానికి కీలకంగా మారింది. గత ఎన్నికల్లో ఓడిన పార్టీ.. ఈసారి ఎన్నికల్లో కూడా జనసేన ఏపీలో ప్రభావాన్ని చూపించకపోతే పార్టీ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గత ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాలకు గుడ్ బై చెప్పి సినిమాలలోకి వెళ్లిపోతారని పెద్దఎత్తున ప్రచారం జరిగింది. ప్రజలు తనను ఆదరించకపోయినా, ఓటమిపాలైన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ ఐదేళ్లుగా రాజకీయాలను కొనసాగించారు. ఎన్నో సందర్భాల్లో ప్రజల సమస్యల కోసం ప్రభుత్వంతో పోరాటం చేశారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పనులను తీవ్రస్థాయిలో నిరసించారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని ఓడిస్తానని శపథం చేశారు.
ఈనేపథ్యంలో తన పార్టీ గెలుపు కన్నా.., వైసీపీ ఓటమే లక్ష్యంగా పవన్ రాజకీయ నిర్ణయాలు తీసుకున్నారు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను శాస్త్రీయంగా పరిశీలించి పొత్తు ధర్మం పాటించడం అవసరమని భావించారు. 2014 ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన టీడీపీ, బీజేపీ కూటమికి జనసేన మద్దతిచ్చినప్పుడు వచ్చిన ఓట్ల శాతం, 2019లో మూడు పార్టీలు విడివిడిగా బరిలోకి దిగినప్పుడు వచ్చిన ఓట్ల శాతాలను కలిపితే దాదాపు సమానం. 2014లో టీడీపీ, బీజేపీ కూటమికి 46.63 శాతం వచ్చాయి. 2019లో టీడీపీ, బీజేపీ, జనసేన విడివిడిగా పోటీ చేయగా టీడీపీకి 39.26 శాతం, జనసేనకు 5.15 శాతం, బీజేపీకి 0.84 శాతం ఓట్లు వచ్చాయి. ఈ గణాంకాలను పరిశీలిస్తే పొత్తులో భాగంగా మూడు పార్టీల మధ్య ఓట్ల బదిలీ ఎంత కీలకమో తెలుస్తోంది. ఇవన్నీ పరిశీలించిన పవన్ కల్యాణ్.. టార్గెట్ వైసీపీని ఓడించాలంటే సొంతంగా బరిలో నిలవడంగా కన్నా, మూడు పార్టీలు కలవడం మేలని గుర్తించారు. అందరినీ కలపడంలో సక్సెస్ సాధించారు.
2019 ఎన్నికల ఫలితాలు, ప్రస్తుత రాజకీయ అవసరాలను దృష్టిలో ఉంచుకునే తక్కువ స్థానాల్లో పోటీకి పరిమితమయినట్టు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. అది భవిష్యత్ పార్టీ బలోపేతంపై ప్రభావం చూపుతుందని పలువురు విమర్శించినా, ప్రస్తుత పరిస్థితుల్లో పవన్ నిర్ణయం మంచిదే. పవన్ తన లక్ష్యానికి అనుగుణంగానే వెళ్తున్నట్లు దీన్ని బట్టి అర్థం అవుతోంది. ఈసారి అసెంబ్లీలో ప్రవేశించి, ప్రభావం చూపడం ద్వారా పార్టీకి బలమైన పునాది ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్టు జనసేన చెబుతోంది.
పొత్తులో భాగంగా 21 సీట్లకే పరిమితం అయిన జనసేన ప్రధానంగా మూడు జిల్లాలపై ఫోకస్ చేసింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని జనసేన సిట్టింగ్ సీటు రాజోలుతోపాటుగా పి.గన్నవరం, కాకినాడ రూరల్, రాజానగరం నుంచి ఆ పార్టీ అభ్యర్థులు పోటీలో నిలుస్తున్నారు. జనసేనాని పవన్ కల్యాణ్ కూడా పిఠాపురం నుంచి పోటీలో ఉండనున్నట్లు ప్రకటించారు. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నిడదవోలు, నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, పోలవరం అసెంబ్లీ స్థానాల నుంచి జనసేన అభ్యర్థులను అధికారికంగా ప్రకటించారు.దాంతో విశాఖ జిల్లాలో నాలుగు సీట్లు, తూర్పు గోదావరి జిల్లాలో ఐదు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరు స్థానాల నుంచి ఆ పార్టీ పోటీలో ఉండబోతోంది. మిగిలిన వాటిలో ఉత్తరాంధ్ర నుంచి మరో రెండు సీట్లు పాలకొండ, నెల్లిమర్ల నుంచి కూడా జనసేన బరిలో ఉంటుంది. కృష్ణా జిల్లా అవనిగడ్డ, గుంటూరు జిల్లా తెనాలి నుంచి కూడా పోటీలో ఉండబోతున్నట్టు ప్రకటించారు. అంటే ఉత్తరాంధ్ర నుంచి కృష్ణా జిల్లా వరకూ కలుపుకుని 19 సీట్లకు పోటీలో ఉన్నట్లయింది.
కేవలం గోదావరి, విశాఖ ఉమ్మడి జిల్లాలు కలిపి మొత్తం 49 స్థానాలకు గానూ జనసేన 15 సీట్లను తీసుకుంది. జనసేన మొత్తం అభ్యర్థుల్లో రెండింట మూడొంతులకు పైగా ఈ మూడు జిల్లాల వారే ఉన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలో డిసైడ్ చేసేది కూడా ఆయా జిల్లాలే. దీంతో కూటమి గెలిచినా, ఫలితాలు అంతకంటే భిన్నంగా ఉన్నా కచ్చితంగా పవన్ ప్రభావం చూపినట్లే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY