ఊహించినదే జరిగింది! అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి జో బైడెన్ తప్పుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆయన ప్రకటించారు. పార్టీ ప్రయోజనాలు, దేశ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలుపుతూ ఎక్స్ వేదికగా బైడెన్ ఓ లేఖను పోస్ట్ చేశారు. డొనాల్డ్ ట్రంప్‌నకు వ్యతిరేకంగా బైడెన్ పేలవమైన డిబేట్ ప్రదర్శన కనబరచడం, దేశాధ్యక్షుడిగా మరో దఫా పూర్తి చేయలేరన్న రిపబ్లికన్ పార్టీ విమర్శల మధ్య అధ్యక్ష రేసు నుంచి వైదొలగాలని జో బైడెన్ నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్ష అభ్యర్థిగా జో బైడెన్ వైదొలగాలని పలువురు డెమోక్రాట్ చట్టసభ సభ్యులు సైతం డిమాండ్ చేశారు. తమ డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థే మళ్లీ దేశ అధ్యక్షుడిగా ఎన్నిక కావాలనేదే తన ఉద్దేశమన్నారు. వచ్చే వారం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తానని బైడెన్ తెలిపారు. తనతో పాటు పని చేసిన కమలా హారిస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్, భారత సంతతి వనిత కమలా హ్యారిస్‌కు తన మద్దతు ఉంటుందని తెలుపుతూ అధ్యక్షుడు బైడెన్ సోషల్ మీడియాలో మరో పోస్ట్ పెట్టారు.డెమొక్రాట్లు ఐక్యంగా నిలబడి ట్రంప్‌ను ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు.
బైడెన్ చెప్పినంత మాత్రాన కమలా హారిస్‌కు డెమొక్రటిక్ పార్టీ నుంచి నేరుగా అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం దక్కే అవకాశం లేదు. వచ్చే నెల 19 నుంచి 22 మధ్య షికాగోలో జరిగే డెమొక్రటిక్ పార్టీ సదస్సులోనే దేశ అధ్యక్ష అభ్యర్థిని నిర్ణయిస్తారు. 4,700 మంది డెమొక్రటిక్ పార్టీ ప్రతినిధులు కలిసి పార్టీ అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకుంటారు. మళ్లీ ప్రతినిధులతోపాటు సూర్ డెలిగేట్లు, మాజీ అధ్యక్షులు, మాజీ ఉపాధ్యక్షుల మద్దతును హారిస్ కూడగట్టుకోవాల్సి ఉంటుంది. నవంబరులో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఆలోగానే ఇదంతా జరిగిపోవాలి. ఎన్నికల ప్రచారం కూడా జరగాలి. డెమొక్రాట్లలో ఎక్కువ మంది మద్దతును కలిగి ఉండటం కమలా హ్యారిస్‌కు ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఎన్నికలకు తక్కువ టైం ఉండటంతో ప్రయోగాలకు పోకుండా.. ఆమెకే ఛాన్స్ ఇచ్చేందుకు డెమొక్రటిక్ పార్టీ మొగ్గు చూపొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్, ఇల్లినోయీ గవర్నర్ జేబీ ఫ్రిట్జ్‌కెర్ కూడా పోటీలో ఉన్నారు.
ఓ వైపు దాడి తర్వాత మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో దూకుడుతో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇటు డెమొక్రటిక్ పార్టీ నుంచి జో బైడెన్ పోటీ నుంచి తప్పుకోవడంతో ఇప్పుడు ఈ పార్టీకి అద్యక్ష పదవికి అభ్యర్థిని వీలైనంత తొందరగా ప్రకటించాల్సి ఉంటుంది. రిపబ్లికన్ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించే సత్తా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు ఉందని పలువురు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. తాజాగా, డెమొక్రాటిక్ పార్టీ సీనియర్ నేత, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE